Begin typing your search above and press return to search.

చిరుని భయపెట్టిన సంఘటన

By:  Tupaki Desk   |   1 Jan 2018 6:02 AM GMT
చిరుని భయపెట్టిన సంఘటన
X
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ లో సైతం కొందరికి అనుమానమే. బాస్ ని గతంలో లాగా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని. కాని ఆ భయాలను పటాపంచలు చేస్తూ బాహుబలి తరువాత హయ్యస్ట్ గ్రాసర్ గా ఖైది నెంబర్ 150 నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే జరిగిన ఒక సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో దీని గురించి గుర్తు చేసుకుని తన మానసిక స్థితి అప్పుడు ఎలా ఉండేదో వివరించారు చిరంజీవి. తమిళ కత్తి రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ తనను చూస్తారా అనే అనుమానం తన మనసులో ఉండిపోయిందని, షూటింగ్ అయ్యాక కూడా అదే డౌట్ కొంత కాలం వెంటాడిందని చెప్పారు. కాని గుంటూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలకు తనను చూడడానికి పదిహేను నుంచి పాతిక వయసున్న కుర్రాళ్ళే ఎక్కువగా రావడం తనకున్న భయాలన్నీ పోగొట్టిందని వివరించారు.

సినిమా విడుదల అయ్యాక వంద కోట్లకు పైగా వసూళ్లు చూసి ఈ జీవిని ఇంకా చిరంజీవిగానే గుర్తుంచుకున్నారని చిరంజీవి చెప్పడంతో హాలు మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. తనకు ఇవ్వాల్సింది కం బ్యాక్ అవార్డు కాదని వెల్కమ్ బ్యాక్ అని చమత్కరించారు చిరు. ఈ సందర్భంగా వివిధ క్యాటగిరీస్ లో అవార్డులు తీసుకున్న నటీనటులు అందరూ చిరుకు తాము ఎంత పెద్ద అభిమానులమో గుర్తు చేయటం బాగా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగా - దేవి శ్రీ ప్రసాద్ స్టేజి పైనే పాదాభివందనం చేసి తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా చిరు కం బ్యాక్ అవార్డును కృష్ణంరాజు - టి.సుబ్బరామిరెడ్డి సంయుక్తంగా అందజేసారు. బాలకృష్ణ, నాని తదితరులు హాజరైన ఆ వేడుక ఆద్యంతం చిరు నామస్మరణతోనే మారుమ్రోగడం విశేషం.