Begin typing your search above and press return to search.

సింహా-లెజెండ్ కథలకు చిరు సలహాలు

By:  Tupaki Desk   |   11 April 2016 5:49 AM GMT
సింహా-లెజెండ్ కథలకు చిరు సలహాలు
X
మెగా-నందమూరి కుటుంబాల మధ్య తెలియని ఓ శతృత్వం ఉందన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఆ రెండు కుటుంబాల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. మెగా-నందమూరి హీరోలు కూడా అప్పుడప్పుడూ ఒకరి మీద ఒకరు పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి-బాలకృష్ణల మధ్య పరోక్ష వైరం దశాబ్దాలుగా ఉంది. ఐతే బాలయ్య కెరీర్ ను మలుపుతిప్పిన సింహా.. లెజెండ్ సినిమాల కథలు ఆయన కంటే ముందు చిరంజీవి విన్నాడంటే నమ్మగలమా.. వినడమే కాదు వాటికి చిరు మార్పులు చేర్పులు చేశాడంటే ఆశ్చర్యపోకుండా ఉండగలమా.. కానీ ఇది వాస్తవం. స్వయంగా చిరంజీవే ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘సరైనోడు’ ఆడియో వేడుకలో చిరు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ‘అన్నయ్య’ సినిమా చేసే రోజుల నుంచి బోయపాటితో తనకు అనుబంధం ఉందని.. అప్పట్లో అతడి ప్రతిభ చూసి పైకి వస్తాడని అనుకున్నానని చిరు చెప్పాడు. ‘‘చాలామందికి తెలియని విషయం ఏంటంటే సింహా.. లెజెండ్ సినిమాల కథల్ని ముందు నాకే వినిపించాడు. నా సలహాలు తీసుకున్నాడు. నేను నాకు అనిపించిన మార్పులు చేర్పులు చెప్పాను’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చిరు.

బోయపాటిలో ఓ పట్టుదల.. తపన.. ఎనర్జీ ఉంటాయని.. అవి తన సినిమాల్లోనూ కనిపిస్తాయని చిరు అన్నాడు. బోయపాటి సినిమాల్లో ఓ బిగువు ఉంటుందని.. ‘సరైనోడు’తో అతను మరిన్ని మెట్లు ఎక్కుతాడని ఆశిస్తున్నానని చెప్పాడు. 150వ సినిమా తర్వాత బోయపాటితో తాను సినిమా చేసే అవకాశం కూడా ఉందని చిరు అనడం విశేషం. అంతా బాగుంది కానీ.. ఈ సమయంలో సింహా.. లెజెండ్ సినిమాల గురించి ప్రస్తావించి.. తాను ఆ కథలకు టచప్స్ ఇచ్చానని చిరు చెప్పడాన్ని బాలయ్య.. ఆయన అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరం. ఇది ఒకరకంగా బోయపాటికి ఇబ్బందికర విషయమే.