Begin typing your search above and press return to search.
సైరా సంక్రాంతికి రాదు
By: Tupaki Desk | 3 Jun 2018 7:37 AM GMT‘ఖైదీ నంబర్ 150’తో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సాఫీగా సాగిపోయింది. పునరాగమనానికి ఒక రీమేక్ మూవీని ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడిన చిరంజీవి.. ఆ తర్వాత మాత్రం పెద్ద రిస్కే చేయడానికి రెడీ అయ్యాడు. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా నరసింహారెడ్డి’కి శ్రీకారం చుట్టాడు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు గత ఏడాది పట్టాలెక్కింది. ఐతే అనుకున్న ప్రకారం ఈ చిత్ర షూటింగ్ సాగలేదు. వివిధ కారణాల వల్ల షెడ్యూళ్లు ఆలస్యమయ్యాయి. అలాగని చిత్ర బృందమేమీ హడావుడి పడటం లేదు. రాజీ పడటం లేదు. చిరు కెరీర్ కే తలమానికంగా ఈ ప్రాజెక్టును నిలబెట్టాలన్న లక్ష్యంతో హడావుడి లేకుండా షూటింగ్ కానిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయాలని ముందు అనుకున్నప్పటికీ.. ఆ డేట్ అందుకోవడం కష్టమే అని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సంక్రాంతికే అని ఫిక్సయితే క్వాలిటీ తేడా వచ్చేయొచ్చని భావించి సినిమాను వేసవికి వాయిదా వేయాలని డిసైడయ్యారన్నది తాజా సమాచారం. ఈ ఏడాది సంక్రాంతి నుంచి వాయిదా పడి వేసవిలో రిలీజై ‘రంగస్థలం’ సంచలన విజయాన్నందుకున్న నేపథ్యంలో ‘సైరా నరసింహారెడ్డి’కి కూడా ఇదే సెంటిమెంటు ఫాలో అవుతున్నారట. ‘రంగస్థలం’ తరహాలోనే వేసవికి తొలి భారీ సినిమాగా దీన్నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ ఏడాది చివరికి ‘సైరా’ షూటింగ్ పూర్తవుతుందని.. పోస్ట్ ప్రొడక్షన్ నెమ్మదిగా చేసుకుని వేసవిలో సినిమాను రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తోంది. అమితాబ్ బచ్చన్.. జగపతిబాబు.. విజయ్ సేతుపతి.. సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణే ఈ చిత్ర నిర్మాత.