Begin typing your search above and press return to search.

చిరు అంత సాహసం చేస్తాడా?

By:  Tupaki Desk   |   14 Dec 2017 10:30 PM GMT
చిరు అంత సాహసం చేస్తాడా?
X
టాలీవుడ్ ఆల్ టైం టాప్ డైరెక్టర్లో ఒకడిగా ఎనలేని గుర్తింపు సంపాదించిన దర్శక రత్న దాసరి నారాయణరావు.. చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. చిన్న సినిమాల కోసం పోరాడటమే కాక.. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన స్పందించేవారు. ఆదుకునే వారు. సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించేవారు. గత రెండు దశాబ్దాల్లో సినిమాలు తగ్గించేసి పూర్తిగా ఇండస్ట్రీ కోసమే పని చేశారాయన. ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా మారింది. ఆయనలా పరిశ్రమకు ఇంకెవరు పెద్ద దిక్కుగా నిలుస్తారు.. ముఖ్యమైన కార్యక్రమాలు వచ్చినపుడు ఎవరు లీడ్ చేస్తారు.. సమస్యలపై ఎవరు స్పందిస్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఐతే ఈ విషయంలో చిరంజీవి కొంచెం లీడ్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో తన సినిమాలు.. తన ఫ్యామిలీ సినిమాలు అన్నట్లుగా ఉన్న చిరు ఈ మధ్య రూటు మార్చారు. బయటి వాళ్లను ఆదరిస్తున్నారు. అండగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీ జనాలు ఏ సాయం కావాలన్నా చిరంజీవి దగ్గరికి వెళ్తున్నారు. తాజాగా జరిగిన ‘తెరవెనుక దాసరి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిన తీరు.. ఇందులో వక్తల అభిప్రాయం ప్రకారం చూస్తే.. దాసరి స్థానం చిరంజీవిదే అని స్పష్టమవుతుంది. ఈ పుస్తకం రాయాలని అనుకున్నపుడు తన దగ్గర ప్రచురణకు కావాల్సినంత డబ్బులు లేవని.. అలాంటి సమయంలో చిరంజీవే తనను ఆదుకున్నారని.. ఈ పుస్తకం బయటికి రావడానికి ఆయనే కారణమని.. అంతే కాక ఇంత పెద్ద స్థాయిలో పుస్తకావిష్కరణ కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది చిరంజీవే అని రచయిత రామారావు అన్నాడు. మరోవైపు ఈ వేడుకలో తమ్మారెడ్డి మాట్లాడుతూ దాసరి స్థానం భర్తీ చేయగల స్థాయి చిరుకు మాత్రమే ఉందని.. దాసరి తరహాలో ఇండస్ట్రీ సమస్యల్ని నెత్తికెత్తుకుని వాటి పరిష్కారానికి పోరాడాలని కోరారు. మిగతా వక్తలు కూడా చిరంజీవి పట్ల ఎంతో గౌరవ భావంతో మాట్లాడుతూ.. ఆయన్ని ఇండస్ట్రీ పెద్దగా అభివర్ణించారు. మరి అందరి కోరికను మన్నిస్తూ చిరు దాసరి స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తారా.. ఆయనలా ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి. ఐతే అదంత సులువైన విషయం కాదన్నది మాత్రం వాస్తవం.