Begin typing your search above and press return to search.

సీఎం కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్..అందుకే!

By:  Tupaki Desk   |   9 Jun 2020 1:30 AM GMT
సీఎం కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్..అందుకే!
X
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మరిన్ని కొత్త సడలింపులు అమలు చేసింది ప్రభుత్వం. ఇదివరకే సామాన్యుల కోసం రవాణా సౌకర్యం.. కిరాణా దుకాణాల అనుమతి.. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల అనుమతి ఇచ్చిన కెసిఆర్ తాజాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సినిమాలు.. టీవీ కార్యక్రమాలకు.. సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతి ఇస్తూ కొత్తగా ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ సడలింపులు అన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగానే జారీ చేసినట్లు తెలిపారు. ఆ నిబంధనల ప్రకారం షూటింగులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుండి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు.. కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, సినామాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సినీ కార్మికుల బతుకుదెరువును దృష్టిలో ఉంచుకొని షూటింగ్స్‌కు అనుమతిచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో తన సందేశం పోస్ట్ చేశారు. కరోనాకి సంబంధించిన మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలో సినిమా - టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం మాట్లాడారు. అయితే సినిమా థియేటర్లకు మాత్రం అనుమతివ్వలేదు. దీనికి సంబంధించిన ఫైలు పై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. అంతేగాక ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో - ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా - టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని - షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని" ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది.