Begin typing your search above and press return to search.

ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు 'సైరా' స్టార్

By:  Tupaki Desk   |   5 Oct 2019 9:13 AM GMT
ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సైరా స్టార్
X
విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని.. ప‌ద్మ‌భూష‌ణుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌నున్నారు. ఆ మేర‌కు 6 అక్టోబ‌ర్ 2019 ఉద‌యం 10.15 నిమిషాల‌కు తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్ .. కె.య‌న్.రోడ్ లో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కులు మాట్లాడుతూ.. ``మెగాస్టార్ చిరంజీవి `సైరా: న‌ర‌సింహారెడ్డి` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ఆనందంలో ఉన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా మెగాస్టార్ అద్భుతంగా న‌టించారు. ఐదు భాష‌ల్లో రిలీజైన సైరా గొప్ప విజ‌యం సాధించింది. ఒక గొప్ప చారిత్ర‌క విజ‌యం అందుకున్న‌ సంద‌ర్భంగా ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఆయ‌న విచ్చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. గ‌న్న‌వ‌రం నుంచి తాడేప‌ల్లి చేరుకుని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. అటుపై తిరిగి మెగాస్టార్ హైద‌రాబాద్ కి విచ్చేస్తారు`` అని తెలిపారు.

ఎస్వీఆర్ స్వ‌గ‌తం ప‌రిశీలిస్తే.. ఆయ‌న పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జ‌న్మించారు. 18 జూలై 1974లో గుండెపోటుతో ప‌ర‌మ‌ప‌దించారు. మ‌ద్రాసు ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌గానే ఆయ‌న‌ ప్రముఖ సినీ నటుడిగా.. దర్శక‌రచయితగా పాపుల‌ర‌య్యారు. కృష్ణా జిల్లా- నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు- ఏలూరు- విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో న‌టించారు. షేక్ స్పియ‌ర్ డ్రామాల్లో న‌టించిన అనుభ‌వంతోనే సినీన‌టుడు అయ్యారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు- హిరణ్య కశిపుడు- ఘటోత్కచుడు- కంసుడు- కీచకుడు- నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో పౌరాణికాల్లో గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి- మాయాబజార్- నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు.

ఎస్వీఆర్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకుంది. విశ్వనట చక్రవర్తి- నట సార్వభౌమ- నటసింహ ఈయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించాడు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975).