Begin typing your search above and press return to search.

జగన్ భేటీ వారం క్రితమే ఫిక్సు అయితే.. చిరు ఎందుకు చెప్పనట్లు?

By:  Tupaki Desk   |   13 Jan 2022 1:30 PM GMT
జగన్ భేటీ వారం క్రితమే ఫిక్సు అయితే.. చిరు ఎందుకు చెప్పనట్లు?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మర్యాదపూర్వక లంచ్ భేటీ ఉందన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి పీఆర్ విభాగం వారు.. గురువారం ఉదయం రిలీజ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను ఆయన కలవబోతున్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీసులో వారి భేటీ ఉంటుందని చెప్పారు. ఈ వార్త.. విపరీతంగా వైరల్ కావటమే కాదు.. అందరూ దీని గురించి మాట్లాడుకోవటం మొదలైంది.

ఇంతకీ చిరును ఎవరు ఆహ్వానించారు? ఎప్పుడు ఆహ్వానించారు? ఎందుకు పిలిచారు? ఏ హోదాలో ఏపీ సీఎం భేటీకి చిరు వెళ్లారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలురాకుండానే వారి సమావేశం జరిగింది. అయితే.. అనుకోని రీతిలో జగన్ - చిరు భేటీ గురించి కింగ్ నాగార్జున రియాక్టు కావటం.. ఆసక్తికర అంశాల్ని వెల్లడించటంతో జగన్ - చిరు భేటీకి సంబంధించిన సందేహాలకు కాసింత సమాధానాలు దొరికినట్లైంది.

తాను చిరంజీవి తరచూ మాట్లాడుకుంటామని.. వారం క్రితమే ఏపీ సీఎం జగన్ ను తాను కలవనున్నట్లు చిరంజీవి తనకు చెప్పారని నాగార్జున వెల్లడించారు. తనను కూడా రావాలని అడిగారని.. అయితే.. తన తాజా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల తాను రాలేనని చెప్పినట్లుగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆహ్వానం రావటంతోనే చిరు వెళ్లిన విషయం నాగార్జున మాటల్ని విన్నప్పుడు అర్థమవుతుంది. అంటే..దాదాపు వారం కంటే ముందే జగన్ - చిరు భేటీకి టైం ఫిక్సు అయ్యింది. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏ ఇద్దరు కలిసినా ఆహ్వానించాల్సిందే.

అందునా.. తాజా సమస్యకు మూలమైన ముఖ్యమంత్రితోనే చిరు భేటీ అంటే మంచిదే. ఎందుకంటే సినిమా పరిశ్రమ గురించి 365 డిగ్రీస్ లో చిరంజీవికి తెలియని సమస్య అంటూ ఉండదు. అదే సందర్భంలో సీఎం జగన్ అనుకోవాలే కానీ.. తాను వేసిన పీటముడుల్ని విప్పటం ఆయనకు చిటికెలో పని. ఈ నేపథ్యంలో వారి భేటీ సినిమా టికెట్ల ఇష్యూను ఒక కొలిక్కి వచ్చేందుకు సాయం చేస్తుంది. ఇదంతా ఓకే అనుకుందాం. కానీ.. ఈ వారం మొదట్లో నెల్లూరు జిల్లా కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నోటి నుంచి బలుపు మాటలు రాకపోయినా ఏమయ్యేది కాదు.

అదే సమయంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాల్ని చర్చించేందుకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను.. ఏపీ మంత్రి పేర్ని నాని పిలవకపోయిన బాగుండేది. ఓవైపు.. ఇవన్నీ జరుగుతున్న వేళకు చాలా ముందే సీఎం జగన్ తో చిరు భేటీకి టైం ఫిక్సు కావటం.. దాని గురించి ఆయన మాట వరసకు కూడా బయటకు వెల్లడించకపోవటం గమనార్హం. ఎందుకిలా అంటే.. చిరు ఏమీ తన ఇంటి సమస్య గురించి మాట్లాడటానికి సీఎం జగన్ ను కలవలేదు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచటానికి. మంది గురించి మాట్లాడటానికి వెళుతున్న వేళ.. దాని గురించి ముఖ్యమైన వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది.

అందునా.. అనూహ్య రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. ఇండస్ట్రీ తరపున.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అన్న హోదాలో వెళుతున్నప్పుడు మరింత బాధ్యత వహించాల్సి ఉంటుంది. అన్నింటికి మించి.. చిత్రపరిశ్రమ మీద అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు 'బలిసిన' వ్యాఖ్య చేసినప్పుడు.. దానిపై అందరూ ఆగ్రహంగా ఉన్నప్పుడు.. కనీసం దాని గురించి ఒక వివరణ.. లేదంటే ఖండన.. ఇవేమీ సాధ్యం కాదంటే.. సీఎం జగన్ గారు విచారం వ్యక్తం చేశారన్న కనీస మాటను కూడా మాట్లాడకుండా.. అందరూ మూసుకోవాలని చిరంజీవి తేల్చేయటంతోనే సమస్య అంతా. ఎవరి గురించి ఎవరు మాట్లాడాలి? నోటికి వచ్చినట్లుగా మాట్లాడినా పడాల్సిన దొరతనం ఏమిటి? చిత్రపరిశ్రమ మీద అజమాయిషీ చేయటానికి చిరుకు ఏం హక్కు ఉంది? అన్నది అసలు ప్రశ్న. దీనికి మెగాస్టార్ సమాధానం చెప్పాల్సిందే.