Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

By:  Tupaki Desk   |   10 March 2022 10:39 AM GMT
ఉక్రెయిన్ లో చిక్కుకున్న వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్
X
యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో నివసిస్తున్న ఒక భారతీయ వైద్యుడు తన పెంపుడు జంతువు చిరుతలను అక్కడ ఒంటరిగా వదిలివేయడానికి ఇష్టపడకుండా వాటితోపాటే అక్కడే జీవిస్తున్నాడు. భారత రాయబార కార్యాలయ అధికారులు అతడిని భారత్ కు పంపించడానికి సిద్ధమైనా కూడా రెండు చిరుతల కోసం అక్కడే ఉంటానని వైద్యుడు తెలుపడం వైరల్ గా మారింది.

ఈ చిరుతలను దత్తత తీసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవియే కారణమని డాక్టర్ ఇటీవల బీబీసీతో వెల్లడించారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి తాజాగా భావోద్వేగానికి గురయ్యాడు. ఒక ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఉక్రెయిన్‌లో ఆర్థోపెడిక్ వైద్యుడిగా చేస్తున్న డాక్టర్ గిరికుమార్ పాటిల్ మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్లాడు. సెవెరోడోనెట్స్క్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ డాక్టర్ రెండు పెంపుడు జంతువులను పెంచుకుంటున్నాడు. ఒక జాగ్వర్ ఒక పాంథర్. ఈ రెండు చిరుత పులలను అతను కైవ్ జంతుప్రదర్శనశాల నుండి వాటిని కొన్నాడు. దేశంలో అడవి జంతువులను పెంచడానికి స్థలం ఉంటే వారికి విక్రయించడానికి దేశంలో పోలీసులు అనుమతులు ఇచ్చాడు.

అయితే ఇప్పుడు తను పెంచుకుంటున్న రెండు చిరుత పులలను విమానంలో తరలించలేము కాబట్టి గిరికుమార్ ఉక్రెయిన్ లోనే ఉండిపోయాడు. యుద్ధం జరుగుతున్నా కూడా పెంపుడు పులల కోసం దేశాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించాడు. రష్యా దాడులతో అక్కడ ఒక బంకర్‌లో నివసిస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఒకటైన ‘లంకేశ్వరుడు’లో చిరుతను చిరంజీవి మచ్చిక చేసుకొని పెంచుకుంటాడని.. ఆయన స్ఫూర్తితోనే వాటిపై నాకు ఇష్టం ఏర్పడింది’’ అని గిరికుమార్ చెప్పారు.

ఈ వార్తలపై స్పందించిన మెగాస్టార్, గిరికుమార్‌కు జీవుల పట్ల ఉన్న ఇష్టాన్ని మెచ్చుకున్నారు. అతనిని ప్రేరేపించినందుకు సంతోషించారు. గిరికుమార్‌కు భద్రత కల్పించాలని ఆకాంక్షిస్తూ, ఉక్రెయిన్‌లో త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

ఇంతలో తన తాజా వీడియోలో గిరికుమార్ రష్యన్ మిలిటరీ దాడి నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఉక్రెయిన్‌లోని మరొక గ్రామానికి వెళుతున్నట్లు వెల్లడించాడు. అయితే తన జాగ్వర్ -పాంథర్ కోసం మాంసాలు కొనడానికి తన బంగారం.. ఇతర వస్తువులను అమ్ముతానని తెలిపాడు. అతను యూట్యూబ్ లో తన పులులతో ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోతున్నాడు. ఉక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవ లేకపోవడం కంటెంట్‌ను పోస్ట్ చేయడాన్ని ఆపివేయవలసి వచ్చిందని చెబుతున్నాడు.

తను ఉంటున్న ప్రాంతంలో వైమానిక దాడులు జరుగుతున్నాయని కూడా వెల్లడించాడు. ఇప్పుడా పులులను కాపాడుకోలేక.. వాటిని ఆహారం సమకూర్చలేక.. యుద్ధంలో అష్టకష్టాలు పడుతున్నాడు ఈ డాక్టర్. అతడి పట్టుదల చూసి చిరంజీవి సైతం ఎమోషనల్ అయ్యాడు.