Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్ట‌ర్ తో చిరు మూవీ వున్న‌ట్టా లేన‌ట్టా?

By:  Tupaki Desk   |   30 May 2022 12:30 AM GMT
యంగ్ డైరెక్ట‌ర్ తో చిరు మూవీ వున్న‌ట్టా లేన‌ట్టా?
X
మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత 'ఆచార్య‌' చిత్రంతో ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చారు. త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించిన ఈ మూవీని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌క్కించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం సాధార‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు మెగా అభిమానుల్ని తీవ్రంగా నిరాశ ప‌రిచింది. ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ అంత వ‌ర‌కు వేసుకున్న లెక్క‌ల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.

ఇంత‌ వ‌ర‌కు ఎడా పెడా సినిమాలు అంగీక‌రిస్తూ షాకులిచ్చిన మెగాస్టార్ 'ఆచార్య‌' ఫ‌లితంతో ఒక్క‌సారిగా స్లో అండ్ స్ట‌డీ అంటూ ముందుకు సాగ‌డం మొద‌లు పెట్టారట‌. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం వ‌ల్ల అది త‌న కెరీర్ కి ప్లస్ కాక‌పోగా ప్రాజెక్ట్ అటు ఇటైతే మైన‌స్ గా మారే అవ‌కాశం వుంద‌ని గ్ర‌హించార‌ట‌. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అంగీక‌రించి సెట్స్ పై వున్న సినిమాల స్క్రిప్ట్ ల‌ని తిరిగి క్ష‌ణ్ణంగా ఒక‌టికి ప‌ది సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఇప్ప‌టికే 'ఆచార్య‌' త‌రువాత బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు చిరు. ఇందులో ఇప్ప‌టికే మూడు సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో 'గాడ్ ఫాద‌ర్‌' చేస్తున్నారు.

ఇక త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన 'వేదాలం' మూవీని తెలుగులో మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో 'భోళా శంక‌ర్' పేరుతో రీమేక్ అవుతున్న మూవీలో న‌టిస్తున్నారు. ఇవీ కాకుండా డైరెక్ట‌ర్ బాబి డైరెక్ష‌న్ లో ఓ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు.

ఈ మూవీ తాజా షెడ్యూల్‌ షూటింగ్ త్వ‌ర‌లో మ‌లేసియాలో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూడు చిత్రాల‌తో పాటు మెగాస్టార్ యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల డైరెక్ష‌న్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై డీవీవీ దాన‌య్య ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. అయితే 'ఆచార్య‌' రిజ‌ల్ట్ త‌రువాత ఈ ప్రాజెక్ట్ వుంటుందా? వుండ‌దా? అనే అనేమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయితే వెంకీ కుడుముల స‌న్నిహితులు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేద‌ని, చిరుతో ఖ‌చ్చితంగా వుంటుందని, ప్ర‌స్తుతం వెంకీ కుడుముల క‌థ రెడీ చేస్తున్నార‌ని, చిరుకు ఇంత వ‌ర‌కు పూర్తి స్థాయిలో క‌థ చెప్ప‌లేద‌ని, చిరు వెకేష‌న్ నుంచి తిరిగి వ‌చ్చాకే వెంకీ కుడుముల క‌థని నెరేట్ చేస్తారని, ఆ త‌రువాత చిరు నిర్ణ‌యం ఎలా వుంటుందో దాన్ని బ‌ట్టి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుంద‌ని చెబుతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్ర‌కారం క‌థ విష‌యంలో చిరు పూర్తిగా సాటిస్ ఫై అయితేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.