Begin typing your search above and press return to search.

అందులో చిరంజీవి ని తప్పు పట్టాల్సిందేముంది..?

By:  Tupaki Desk   |   30 Oct 2022 5:30 AM GMT
అందులో చిరంజీవి ని తప్పు పట్టాల్సిందేముంది..?
X
ఇటీవల 'అలయ్ బలాయ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు మధ్య జరిగిన ఎపిసోడ్ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి ఫోటో సెషన్ ను ఆపకుంటే అక్కడి నుంచి వెళ్లిపోతానని గరికిపాటి అసహనం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం.. ఓ వారం పాటు మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

గరికపాటి పై మెగా బ్రదర్ నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేస్తే.. దీంతో మెగా ఫ్యాన్స్ రంగంలోకి ప్రవచనకర్తపై విరుచుకుపడ్డారు. ఆ తరవాత రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి అనంత్ శ్రీరామ్ - శ్యామ్ కె నాయుడు వరకూ పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనపై ఫైర్ అయ్యారు. అయితే ఎప్పటిలాగే కొన్ని రోజులకు ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే చిరంజీవి మళ్లీ ఈ వివాదాన్ని అందరికీ గుర్తు చేశారు.

శుక్రవారం ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలు మెగాస్టార్ తో ఫోటోలు దిగడానికి ఆయన్ని చుట్టుముట్టారు. దీంతో చిరు 'ఇక్కడ వారు లేరు కదా..!' అని అనడంతో అక్కడున్న వారందరూ నవ్వారు. ఇక్కడ పేరు ప్రస్తావించకపోయినా చిరు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారో అందరికీ అర్ధమైంది.

చిరంజీవి సినిమాలలో కామెడీ టైమింగ్ తో అలరించినట్లుగానే.. రియల్ లైఫ్ లోనూ సందర్భోచితంగా పంచులు వేసి నవ్విస్తుంటారు. ఇప్పుడు అలాయ్ బలయ్ లో జరిగిన ఇన్సిడెంట్ ను గుర్తు చేసేలా.. మహిళలు అందరూ ఫోటో దిగడానికి రావడంతో గరికపాటి ని పరోక్షంగా ప్రస్తావించి అందరినీ నవ్వేలా చేశారు.

అయితే గరికపాటి వివాదాన్ని అందరూ మర్చిపోతే.. మళ్లీ మెగాస్టార్ గెలకడం ఎందుకు అని ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అందరూ మర్చిపోయినా ఆ ఘటనను తాను మర్చిపోలేదంటూ గరికపాటి పై వెటకారం చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు స్టేజీ పైన వినయంగా ఉన్నట్లు కనిపించి.. ఈరోజు మళ్ళీ గెలికి గరికపాటి పరువు తియ్యడం హాస్యం అయ్యిందా? అని కొందరు కామెంట్స్ చేశారు.

అదే సమయంలో ఈ విషయంలో చిరంజీవి ని తప్పు పట్టాల్సింది ఏమీ లేదని.. ఆయనేమీ తప్పుగా మాట్లాడలేదు.. గరికపాటిని కించ పరిచే విధంగా కామెంట్ చేయలేదు కదా అని మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. స్వతహాగా పరిస్థితులకు తగ్గట్టుగా జోకులు వేసి నవ్వించే మెగాస్టార్.. అలాంటి సందర్భం వచ్చింది కాబట్టి.. తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకొని నవ్వించి ఉంటారని అభిప్రాయ పడుతున్నారు. చిరు కు ఆ మాత్రం హ్యూమర్ ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి అలాయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి అసహనం వ్యక్తం చేసినా.. చిరంజీవి దాన్ని ఏమాత్రం అవమానంగా తీసుకోలేదు. ఎలాంటి కోపతాపాలకు పోకుండా.. వినయ విధేయతలు ప్రదర్శించారు. తన సంస్కారం ఎలాంటిదో తెలియజెప్పారు. ఇప్పుడు కూడా సభలో అందరినీ నవ్వించడానికి జస్ట్ జోక్ వేసాడే తప్ప.. అక్కడ ఏదో మనసులో పెట్టుకుని వెటకారం చేసారనుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.