Begin typing your search above and press return to search.

రాజమౌళి కారణంగా ఆ రెండు కోరికలు నెరవేరాయన్న చిరూ!

By:  Tupaki Desk   |   25 April 2022 8:33 AM GMT
రాజమౌళి కారణంగా ఆ రెండు కోరికలు నెరవేరాయన్న చిరూ!
X
'ఆచార్య' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిని చిరంజీవి ఆకాశానికి ఎత్తేశారు. తెలుగు సినిమాను ప్రాంతీయత నుంచి ఇండియన్ సినిమా అనిపించుకునే దిశగా ప్రయత్నం చేయడంలో ఆయన కీలకమైన పాత్రను పోషించారని చెప్పారు. ఆదిలో ఆయన వేసిన బాటలోనే ఇప్పుడు ఇండస్ట్రీ నడుస్తుందని అన్నారు. తెలుగు సినిమా రూపురేఖలను మార్చిన ఘనత రాజమౌళిగారికి చెందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన చిరకాల కోరికలు రెండు రాజమౌళి కారణంగా నెరవేరయని చెప్పారు.

'రుద్రవీణ' సినిమాకిగాను తాను 'నర్గిస్ దత్' అవార్డును అందుకోవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు, అక్కడ తెలుగు సినిమాను ఎవరూ పట్టించుకోకపోవడం తనకి బాధను కలిగించిందనీ, తెలుగు సినిమాకి ఆ వేదికపై అంతగా ప్రాముఖ్యత దక్కకపోవడం తనకి అవమానంగా అనిపించిందని అన్నారు.

మద్రాసులో ప్రెస్ మీట్ తాను ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించలేదని చెప్పారు. అలాంటి పరిస్థితి రాజమౌళి రాకతో మారిపోయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన 'బాహుబలి' తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పిందని అన్నారు.

ఈ రోజున 'పుష్ప' .. 'ఆర్ ఆర్ ఆర్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పొందుతున్న ఆదరణ చూస్తుంటే తనకి చాలా ఆనందంగా ఉందనీ, ఈ మార్పు కోసం వెయిట్ చేస్తున్న తన కలను రాజమౌళి నెరవేర్చారని అన్నారు.

అలాగే తనకి చరణ్ కలిసి పూర్తిస్థాయిలో ఒక సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందనీ, తమ ఇద్దరినీ ఎక్కువసేపు తెరపై చూడాలనే కోరిక సురేఖ మనసులో మరింత బలంగా ఉందని చెప్పారు. అలాంటి ఒక కథ కొరటాల వలన దొరికింది. కానీ అందుకు అనుమతించవలసిన బాధ్యత రాజమౌళిపై ఉందని అన్నారు.

ఆ సమయంలో చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తుండటం వలన, ఆయనను రాజమౌళి వదలరనే విషయం తమకి తెలుసనీ, ఎందుకంటే అది మొదటి నుంచి రాజమౌళి పెట్టుకున్న ఒక నియమనీ .. దానిని ఆయన అతిక్రమించరని చెప్పారు. అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దామనే ఆలోచనతో రాజమౌళిగారితో మాట్లాడాను.

పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన ఓకే అన్నారు. ఆయనను చరణ్ వదిలినప్పుడల్లా అతనికి సంబంధించిన షూటింగ్ చేస్తూ వెళ్లడం జరిగింది. రాజమౌళిగారు ఒప్పుకోకపోతే ఈ సినిమా ఇప్పట్లో వచ్చేదే కాదు. ఆయన వల్లనే ఈ కోరిక కూడా నెరవేరింది" అని చెప్పుకొచ్చారు.