Begin typing your search above and press return to search.

త‌మ్ముడు దూకుడుకి అన్న‌య్య అప్సెట్ అయ్యారా?

By:  Tupaki Desk   |   28 Sep 2021 7:36 AM GMT
త‌మ్ముడు దూకుడుకి అన్న‌య్య అప్సెట్ అయ్యారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. అలాగే మంత్రిపై ఇటీవ‌ల `రిప‌బ్లిక్` మూవీ ప్ర‌చార వేదిక‌పై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌ల‌కు మెగాస్టార్ చిరంజీవి అప్ సెట్ అయ్యారా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఊపిరాడ‌నివ్వ‌ని ఆన్ ల‌కేష‌న్ షెడ్యూల్స్ ఉన్నా.. చిరు ఆక‌స్మికంగా హైద‌రాబాద్ కి రావ‌డం ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుసల‌కు తావిచ్చింది. మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య‌`తో పాటు మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న `గాడ్ ఫాద‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది.

ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త‌మిళ‌నాడులోని ఊటీలో జ‌రుగుతోంది. ముందు చేసుకున్న ప్లాన్ ప్ర‌కారం ఈ షెడ్యూల్ ఊటీలో ఈ నెల 28 వ‌ర‌కు జర‌గాల్సి వుంది. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో చిరు సోమ‌వారం ఆక‌స్మికంగా హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. అంతే కాకుండా మిగ‌తా షూటింగ్ ని హైద‌రాబాద్ లోనే ప్లాన్ చేయ‌మ‌ని నిర్మాత‌ల‌ని చిరు రిక్వెస్ట్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు.

అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల సమాచారం ప్ర‌కారం చిరు తాజా డెవ‌ల‌ప్ మెంట్స్.. ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో చిరు చాలా అప్ సెట్ అయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల టిక్కెట్ రేట్ల‌పై.. ఎక్స్ ట్రా షోల గురించి.. ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల గురించి ఏపీ ప్ర‌భుత్వాన్ని చిరు అభ్య‌ర్థించిన విష‌యం తెలిసిందే. తాను అనుకున్న విధంగానే ఏపీ ప్ర‌భుత్వం నుంచి జీవో విడుద‌ల కాబోతోంద‌ని ఆశగా చిరు ఎదురుచూస్తున్న త‌రుణంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆ ఆశ‌ల‌కు గండికొట్టాయి. దీంతో చిరు కొంత అస‌హ‌నానికి లోన‌యిన‌ట్టుగా టాక్ వినిపిస్తోంది.

తాజా ప‌రిస్థితులు చిరుని ఇబ్బంది క‌లిగించ‌డం వ‌ల్లే ఆయ‌న `గాడ్ ఫాద‌ర్‌` షూటింగ్ లో పాల్గొన‌లేక‌పోయార‌ని.. ఆ కార‌ణంగానే ఇలా చాలా ముందే తిరిగి హైద‌రాబాద్ చేరుకోవ‌డం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో చిరు ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తారా? లేక ఫిల్మ్ ఛాంబ‌ర్ త‌ర‌హాలోనే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఇండ‌స్ట్రీకి ఎలాంటి సంబంధం లేద‌ని ఓపెన్ లెట‌ర్ ని విడుద‌ల చేస్తారా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ రాంగ్ టైమింగ్ తో ఏపీ ప్ర‌భుత్వంపై వ్యాఖ్య‌లు గుప్పించార‌ని టిక్కెట్టు స‌మ‌స్య స‌హా టాలీవుడ్ స‌మ‌స్య‌లు తీరాక తాపీగా అత‌డు కామెంట్ల ప‌ని పెట్టుకుంటే బావుండేది అన్న విశ్లేషణ కూడా సాగుతోంది.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల అనంత‌రం దిద్దుబాటు చ‌ర్య‌లు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ దుందుడుకు ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌వ‌న్ కామెంట్ ఎఫెక్ట్ తో తెలుగు ఫిలింఛాంబ‌ర్ దిద్దుబాటు లేఖ‌! రాసిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కి ప్ర‌భుత్వాల‌ అండ ఉంది.. వ్య‌క్తిగ‌త ఉద్ధేశాలు వారిష్టం.. అంటూ ఛాంబ‌ర్ లేఖ రాయ‌డంతో అది సినీపెద్ద‌ల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రిప‌బ్లిక్ వేదిక‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు పూర్తిగా అత‌డి వ్య‌క్తిగ‌తం అంటూ అంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఆయ‌న సూటిగా ఏపీ ప్ర‌భుత్వాన్ని .. సీఎం జ‌గ‌న్ ని.. మంత్రి పేర్ని నానిని ఘాటైన ప‌ద‌జాలంతో తూర్పార‌బ‌ట్ట‌గా.. దానిని ప‌లువురు ఖండించారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు తీవ్ర న‌ష్టం క‌లిగిస్తోంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించడం ప‌రిశ్ర‌మ‌కు మేలు చేయ‌ద‌న్న‌ది కొంద‌రి అభిప్రాయం.

అయితే ఈ వ్యాఖ్య‌లు పూర్తిగా ఇండివిడ్యువ‌ల్ గా చేసిన‌వి అని వాటిని ప‌రిశ్ర‌మ‌కు ఆపాదించుకోలేమ‌ని తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఓ అధికారిక లేఖ‌లో సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చింది. ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ల నుంచి అన్ని విధాలా స‌హ‌కారం ఉంద‌ని స‌ద‌రు లేఖ‌లో పేర్కొన్నారు. 2020-21 సీజ‌న్ అంతా క‌రోనా మ‌యం అయిపోయి ప‌రిశ్ర‌మ తీవ్ర ఇబ్బందుల్లో ప‌డిందని వేలాది కార్మికులు ఆధార‌ప‌డి జీవిస్తున్న ఈ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వాల ప్రోత్సాహ‌కం చాలా అవ‌స‌ర‌మ‌ని లేఖ‌లో కోరారు. ఇటీవ‌ల మంత్రి పేర్ని నానీతో స‌మావేశంలో అన్ని విష‌యాల‌ను ఎంతో ఓపిగ్గా విన్నార‌ని.. ప‌రిశ్ర‌మ సాధ‌క‌బాధ‌కాల‌ను ప‌రిశీలించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఆయ‌న స‌హ‌క‌రించార‌ని కూడా లేఖ‌లో వెల్ల‌డించారు. క‌రోనా వ‌ల్ల ప‌రిశ్ర‌మ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని అన్నారు. సీఎం జ‌గ‌న్ ఓపిగ్గా టాలీవుడ్ స‌మ‌స్య‌లు వింటున్నార‌ని పాజిటివ్ గా స్పందించి అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్నార‌ని.. తెలుగు ఫిలింఛాంబ‌ర్ లేఖ‌లో పేర్కొన‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు తావిచ్చింది.

ప‌వ‌న్ కామెంట్ ఎఫెక్ట్.. ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా ఫిలింఛాంబ‌ర్ జాగ్ర‌త్త‌ప‌డింది. ఇప్పుడు టాలీవుడ్ పెద్ద‌గా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి తిరిగి ఏపీ ప్ర‌భుత్వంతో మంత్రి పేర్నితో స‌త్సంబంధాల కోసం ప్రాధేయ‌ప‌డాల్సి ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. లేదూ త‌మ్ముడు అలా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం.. అనంత‌రం అన్న‌య్య దిద్దుబాటుకు ప్ర‌య‌త్నించ‌డం అనేది ఒక ర‌క‌మైన వ్యూహం కావొచ్చేమో! అనే గుస‌గుసా ఓ సెక్ష‌న్ లో ఉంది.