Begin typing your search above and press return to search.

'ధర్మస్థలి' సెట్ చూసి చిరూ షాక్ అయ్యారు: కొరటాల

By:  Tupaki Desk   |   2 Dec 2021 9:46 AM GMT
ధర్మస్థలి సెట్ చూసి చిరూ షాక్ అయ్యారు: కొరటాల
X
కొరటాల శివ ప్రతి సినిమాలోను ఏదో ఒక సందేశం ఉంటుంది. అయితే ఆ సందేశం పనిగట్టుకుని చెబుతున్నట్టుగా కాకుండా, కథలో అంతర్లీనంగా ఉంటుంది. అలాంటి ఒక సందేశంతోనే ఆయన 'ఆచార్య' సినిమా కూడా రూపొందింది. చిరంజీవి .. చరణ్ .. కాజల్ .. పూజ హెగ్డే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కొరటాల మాట్లాడారు. "ఓ ధర్మస్థలి .. ఓ టెంపుల్ టౌన్ .. అక్కడ ఒక గురుకులం .. అక్కడ చదువుకునే సిద్ధ .. చూడటానికి అదొక ప్రత్యేకమైన ప్రపంచంలా అనిపిస్తుంది.

ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్ లోనే ఈ సినిమా 60 నుంచి 70 శాతం వరకూ షూటింగు జరుపుకుంది. సినిమాలో ఆ టెంపుల్ కి కూడా ఒక కథ ఉంటుంది. ఎప్పుడు కట్టారు? .. ఎవరు కట్టారు? అనే దానిపై కూడా కొంత కథ నడుస్తుంది. టెంపుల్ నేపథ్యంలోని సన్నివేశాలను రాయడమైతే రాసేశాము. కానీ ఎక్కడికి వెళ్లి షూట్ చేయాలి? అనే ఆలోచనలో పడ్డాను. టెంపుల్ .. టెంపుల్ నేపథ్యంలోని ఊరు అనుకున్నట్టుగా ఎక్కడ దొరుకుతాయి? అనే టెన్షన్ మొదలైంది. బాగా సెర్చ్ చేస్తే ఒక్కోచోట ఒక్కో బ్లాక్ దొరుకుతుందేమో. వాటి కోసం ఎన్ని చోట్లకని తిరిగేది అనేది అర్థం కాలేదు.

ఒక రోజున నేను .. చిరంజీవిగారు .. నిర్మాతలు .. అందరం కూర్చుని, సెట్ వేయవలసిందే అనే నిర్ణయానికి వచ్చేశాము. అందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుంది .. కానీ తప్పదు. సెట్ వేయడం మొదలైంది .. ఖర్చు ఎంత పెడుతున్నా అవుతూనే ఉంది. ఆ టెంపుల్ ను ఇప్పుడు ఎవరు చూసినా, రాయలవారి కాలంలో కట్టినదేమో అనుకుంటారు. సెట్ వేయడం అంతా అయిన తరువాత చిరంజీవిగారు ఒకసారి వచ్చి చూశారు. 'సెట్ అంటే ఏదో అనుకున్నాను .. ఇదేం టెంపుల్ టౌన్' అంటూ షాక్ అయ్యారు. ఇంతవరకూ తాను చూసిన సెట్లలో బెస్ట్ సెట్ ఇదేనని అన్నారు.

ఆ తరువాత మారేడుమిల్లి ఫారెస్టులో ఒక 20 రోజుల పాటు చిరంజీవి - చరణ్ ల పై షూటింగు చేశాము. ఆ ఏరియాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ జీరో. ఫోన్ లేకపోతే అందరం మాట్లాడుకోవడమే కదా. అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్లం. రోజూ అందరం షూటింగుకి కలిసి వెళ్లడం .. కలిసి రావడం. "ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరి పనులు వాళ్లకి ఉంటున్నాయి. నేను .. చరణ్ ఇద్దరం కలిసి ఎక్సర్ సైజులు చేసుకుంటున్నాము. కలిసి షూటింగుకి వెళుతున్నాము .. కలిసి భోంచేస్తున్నాము .. ఇద్దరికి కలిసి వర్కౌట్స్ చేస్తున్నాము .. ఇవి మరిచిపోలేని రోజులు" అని చిరంజీవిగారే అన్నారు" అంటూ చెప్పుకొచ్చారు.