Begin typing your search above and press return to search.

సీఎంతో భేటీ తర్వాత చిరంజీవి - మహేష్ - ప్రభాస్ ఏమన్నారంటే..?

By:  Tupaki Desk   |   10 Feb 2022 9:20 AM GMT
సీఎంతో భేటీ తర్వాత చిరంజీవి - మహేష్ - ప్రభాస్ ఏమన్నారంటే..?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్ తో టాలీవుడ్ పెద్దల బృందం చర్చించారు. భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని అన్నారు. అప్పటికప్పుడు ఐదో షోకు అనుమతివ్వనున్నట్లు చెప్పడం చిన్న సినిమాలకు శుభపరిణామమని చెప్పారు.

సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఫిబ్రవరి మూడో వారంలోపు శుభం కార్డు పడుతుందని తాము భావిస్తున్నామని చిరంజీవి అన్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోనే జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన చిరంజీవి.. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శీఘ్రముగా పరిష్కారం లభిస్తోందని కొనియాడారు. తమ బాధలు అన్ని విన్నారని.. అలానే ప్రజల కోసం కూడా ఆలోచించారని అన్నారు.

హైదరాబాద్ తరహాలో వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారని.. ఏపీలో కూడా షూటింగులు చేయాలని కోరారని చిరంజీవి తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని.. దానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పామన్నారు. ఇకపై ఎప్పుడు పిలిచినా తాను వస్తానని.. సామరస్యంగా పరిష్కరించుకుంటామని అన్నారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే పెద్ద చిత్రాలకు ప్రత్యేక వెసులుబాటు ఇవ్వాలనే దానిపై కమిటీతో మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు చిరంజీవి. మహేష్ బాబు మాట్లాడుతూ.. ''అందరి తరుపున చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఆరు నెలల నుంచి సినీ పరిశ్రమ చాలా డల్ గా ఉంది. ఆయన గత ఆరు నెలల నుంచి కష్టపడుతున్నారు. నిజానికి ఈరోజు సీఎం జగన్‌ తో సమావేశమయ్యాక చాలా పెద్ద రిలీఫ్‌ గా అనిపించింది.పేర్ని నాని గారికి థ్యాంక్స్. జగన్ గారికి మరియు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటారు. వారం లేదా ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంద‌ని అనుకుంటున్నాం'' అని అన్నారు.

ప్రభాస్ మాట్లాడుతూ.. ''ముఖ్యమంత్రి గారు మాకు చాలా టైం ఇచ్చారు. మా సమస్యలకి పాజిటివ్ గా స్పందించారు. చిరంజీవి గారి వల్లే ఇది సాధ్యమైంది. పేర్ని నాని గారికి థ్యాంక్స్ సర్'' అని అన్నారు. ''జగన్ గారికి సినీ పరిశ్రమ గురించి మంచి నాలెడ్జ్ ఉంది. మేము చెప్పినవన్నీ చాలా సహనంతో విన్నారు. పెద్ద సినిమాల కష్టాలు, చిన్నా సినిమాల కష్టాలు వినిపించాం. ఆయనకి మా థ్యాంక్స్. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద అని చెప్పకుండానే అన్ని చేస్తున్నారు. సినీ పరిశ్రమ కష్టాలని ఆయన భుజాన వేసుకొని ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యు సర్'' అని రాజమౌళి అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ''గత కొన్ని నెలలుగా సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. దాన్నికాపాడాలని జగన్ గారికి విజ్ఞప్తి చేసాము. అయన సానుకూలంగా స్పందించారు. పేర్ని నాని గారికి థ్యాంక్స్. చిరంజీవి మంచి రోల్ ప్లే చేశారు. మీరు మెగాస్టార్ చాలా గొప్ప మనిషి. మీరు అందర్ని కలిసి సినిమా కష్టాలు చెప్పారు. చిరంజీవి గారు దయచేసి నంది అవార్డ్స్ కూడా వచ్చేలా చేయండి. పేర్ని నాని గారు ఈ సారి మీటింగ్ ఉంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ - ఫిలిం ఛాంబర్ ని కూడా పిలవండి'' అని అన్నారు.