Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: సినిమావోళ్ల విక్ట‌రీ

By:  Tupaki Desk   |   25 May 2019 1:30 AM GMT
ట్రెండీ టాక్: సినిమావోళ్ల విక్ట‌రీ
X
ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప‌లువురు సినీతార‌లు ఘోరంగా ఓట‌మి పాలైతే.. కొంద‌రు మాత్రం గెలుపు గుర్ర‌మెక్కి అభిమానుల్లో ఆనందం నింపారు. అలాంటి వారి జాబితా ప‌రిశీలిస్తే న‌టి- వైకాపా నాయ‌కురాలు రోజా.. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ.. ఫైనాన్షియ‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు... నిర్మాత‌లు ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌-కొడాలి నాని- వల్లభనేని వంశీ..పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్‌ గణేష్ త‌దిత‌రులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఈసారి సినిమావోళ్లు ఎక్కువ‌గానే పోటీ చేశారు. ఫలితాల్లోనూ సినిమా వాతావరణం కాస్త ఎక్కువగానే కనిపించింది. లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ ప్రముఖులు - వారి బంధువులు విజయకేతనం ఎగురవేయ‌డం క‌నిపించింది. క‌థానాయిక రోజా వైకాపా నాయ‌కురాలిగా అద్భుత విజ‌యం అందుకున్నారు. ఐరెన్ లెగ్ అన్న విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టి తాను గోల్డెన్ లెగ్ అని నిరూపించారు. అలాగే తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదనే విమర్శలను జగన్ ను సీఎం చేయడం ద్వారా త‌న‌పై ప‌డిన‌ ముద్రను పూర్తిగా తొలగించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ తన పార్టీకి ఎంత గట్టి ఎదురు గాలి వీచినప్పటికీ మళ్ళీ ఎంపీగా గెలుపొందారు. ఇక వైజాగ్ పార్లమెంట్ కు జరిగిన పోటీలో సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ మీద పోటీ చేసి మంచి మెజారిటీతోనే గెలుపొందారు. అలాగే పారిశ్రామికవేత్త.. సినీ ప్రముఖులకి ముఖ్యుడయిన ఫైనాన్సియర్ రఘురామ కృష్ణంరాజు నర్సాపురం ఎంపీగా ఎన్నికయ్యారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సన్నిహితులు అయిన నిర్మాతలు కొడాలి నాని - వల్లభనేని వంశీలు చెరొక పార్టీలో ఉన్నా ఇద్దరూ విజయ కేతనం ఎగురవేశారు. న‌ట‌సింహా నంద‌మూరి బాలకృష్ణ హిందూపూర్ లో విజ‌యం అందుకున్నారు. ఇక రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన నటుడు.. నిర్మాత మార్గాని భరత్ సైతం గెలుపు గుర్ర‌మెక్కారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు కన్నబాబు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ త‌మ్ముడు ఉమా శంకర్‌ గణేష్‌ గత రెండు ధపాలుగా పోటీ చేసి ఓడినా ఈసారి మాత్రం గెలుపు గుర్రం ఎక్కాడు. వైకాపాని న‌మ్ముకుని ఆయ‌న న‌ర్సీప‌ట్నంలో అయ్య‌న్న పాత్రుడు ఇలాకాలో గెలిచి శ‌భాష్ అనిపించారు.