Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సినిమా బండి

By:  Tupaki Desk   |   14 May 2021 10:43 AM GMT
మూవీ రివ్యూ : సినిమా బండి
X
‘సినిమా బండి’ మూవీ రివ్యూ
నటీనటులు: వికాస్ వశిష్ఠ-సందీప్ వారణాసి-రాగ్ మయూర్-ఉమ-త్రిషారా తదితరులు
సంగీతం: శిరీష్ సత్యవోలు
ఛాయాగ్రహణం: అపూర్వ-సాగర్
రచన-వసంత్ మరిగంటి
స్క్రీన్ ప్లే: ప్రవీణ్ కంద్రేగుల-కృష్ణ ప్రత్యూష-వసంత్ మరింగంటి
నిర్మాతలు: రాజ్-డీకే
దర్శకత్వం: ప్రవీణ్ కంద్రేగుల

కరోనా నేపథ్యంలో థియేటర్లు అందుబాటులో లేక గత ఏడాది కాలంలో చాలా సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అలాగే కొన్ని చిత్రాలు ఓటీటీల కోసమే రూపొంది.. వాటిలోనే విడుదలయ్యాయి. ఈ కోవలోని మరో చిత్రం.. సినిమా బండి. బాలీవుడ్లో మంచి పేరు సంపాదించిన తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే.. కొత్త నటీనటులు టెక్నీషియన్లతో చేసిన ఈ విభిన్న ప్రయత్నం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ: వీరబాబు (వికాస్ వశిష్ఠ) కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే గొల్లపల్లి అనే పల్లెటూరిలో ఆటో నడుపుకుని జీవనం సాగించే సామాన్య వ్యక్తి. అతడికి భార్య, కూతురు ఉంటారు. కష్టపడి ఆటో నడుపుకుంటూ దాని మీద వచ్చే డబ్బులతో ఇంటిని నడపడంతో పాటు ఆటో ఫైనాన్స్ చెల్లిస్తూ మామూలుగా సాగిపోతుంటుంది అతడి జీవితం. అలాంటి వ్యక్తికి ఒక రోజు ఆటోలో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది. దాంతో ఏం చేద్దామని ఆలోచించాక.. తమ ఊర్లోనే ఉండే ఫొటోగ్రాఫర్ గణ (సందీప్ వారణాసి) సాయంతో ఒక చిన్న సినిమా తీసేద్దామన్న నిర్ణయానికి వచ్చేస్తాడు. అనుకున్నదే తడవుగా వీళ్లిద్దరూ సినిమాకు ఏర్పాట్లు మొదలు పెడతారు. వీరి ప్రయత్నం ఏమేర ఫలించింది.. ఈ క్రమంలో ఎదుర్కొన్న కష్టాలేంటి.. ఈ కెమెరా వల్ల చివరికి వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అదో పెద్ద టాస్క్. అది అందరి వల్లా సాధ్యమయ్యే పని కాదు. ఓ మోస్తరు సినిమా తీయాలన్నా కోట్లు కావాలి. సినిమాకు సంబంధించిన ప్రతి పనిలోనూ నైపుణ్యం ఉన్న వాళ్లు పదులు వందల సంఖ్యలో కలిసి కష్టపడాలి. కథ రాయడంతో మొదలుపెడితే.. ఫస్ట్ కాపీ తీసే వరకు ఎంతో కసరత్తు జరగాలి. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగినా ఆకట్టుకునే సినిమా తయారవుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిది ఒక పల్లెటూరికి చెందిన.. పెద్దగా చదువుకోని ఆటో డ్రైవర్.. తన ఆటోలో దొరికిన ఒక లగ్జరీ కెమెరా పట్టుకుని.. తమ ఊరిలో పెళ్లి ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్ సాయంతో సినిమా తీసేద్దామనుకుంటే.. తమ ఊర్లో ఓ పెద్దాయన ఎప్పుడో రాసిన కథనే ఈ సినిమా కోసం ఎంచుకుంటే.. అదే ఊర్లో సెలూన్ నడిపే కుర్రాడు హీరో అయితే.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయి కథానాయిక అవతారం ఎత్తితే.. వీళ్లందరూ కలిసి షూటింగ్ మొదలుపెట్టి తమకు తోచినట్లుగా సినిమా తీసుకుంటూ పోతే..? ఇవన్నీ ఊహించుకుంటుంటే మరీ విడ్డూరంగా అనిపిస్తాయి. మరీ ఇంత అమాయకత్వమా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఐతే ఈ అమాయకత్వమే ‘సినిమా బండి’లో అత్యంత ఆకర్షణీయ అంశం. అదే గంటా 40 నిమిషాల నిడివిలో చాలా సమయం ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తూ సాగేలా చేస్తుంది.

‘తిథి’ అని ఆరేళ్ల ముందు వచ్చిన ఓ కన్నడ సినిమా. కర్ణాటకలోని ఓ పల్లెటూరిలో అక్కడి మనుషులనే నటీనటులుగా తీసుకుని.. వారి జీవితాలనే స్పృశిస్తూ అత్యంత సహజమైన వాతావరణంలో ఒక హృద్యమైన కథను అందంగా వెండితెరపై ప్రెజెంట్ చేశాడు న్యూ ఏజ్ ఫిలిం మేకర్ రామ్ రెడ్డి. ఇలాంటి సినిమాలు మన వాళ్లు తీయలేరా అన్న ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. ఈ ప్రశ్నలకు గత కొన్నేళ్లలో మన ఫిలిం మేకర్లు కొందరు సమాధానం చెప్పారు. వెంకటేష్ మహా తీసిన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఈ తరహా సినిమానే. ఇటీవల ‘మెయిల్’ పేరుతో అలాంటి స్వచ్ఛమైన సినిమా మరొకటి వచ్చింది. ఇలాంటి అరుదైన సినిమా జాబితాలోకి చేర్చదగ్గ కొత్త చిత్రం ‘సినిమా బండి’. ఒక సినిమాలా కాకుండా ఒక ఊర్లోకి వెళ్లి అక్కడి మనుషులతో కలిసి ప్రయాణం సాగిస్తూ వారి జీవితాలను దగ్గర్నుంచి చూస్తున్న భావన కలిగించే చిత్రమిది. ఎంత పల్లెటూరి వాడైనా సరే.. ఒక ఆటోడ్రైవర్ తనకో లగ్జరీ కెమెరా దొరగ్గానే దాంతో ఓ సినిమా తీసేద్దాం.. కోట్లు సంపాదించేద్దాం అనుకోవడం ముందు మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఐతే అలా అలవాటు పడిపోయాక మాత్రం ‘సినిమా బండి’ కావాల్సినంత వినోదం పంచుతుంది.

సినిమా తీసేద్దాం అని ఆటోడ్రైవర్.. పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ నిర్ణయించుకున్నాక.. తమ చేతికి చిక్కిన కథేతో పట్టుకుని హీరో హీరోయిన్ల ఎంపిక కోసం వాళ్లు పడే పాట్లు భలే సరదాగా సాగుతాయి. సెలూన్ ముందు తన ఫొటోలతోనే డిఫరెంట్ హేర్ కట్స్ తో పోజులు ఇచ్చిన దాని ఓనర్ ను హీరోగా ఎంచుకోవడం.. ఒక కాలేజీ ఇచ్చుకున్న ప్రకటనలో అమ్మాయిల ఫొటోలు చూసి అందులో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా తీసుకుందామని వెంటపడటం.. ఒక కాలేజీ అమ్మాయిని పెట్టి కొన్ని సన్నివేశాలు తీశాక ఆ అమ్మాయి తన ప్రేమికుడితో లేచిపోవడం.. మళ్లీ కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట.. ఇలాంటి సరదా సన్నివేశాలతో ‘సినిమా బండి’ మంచి ఊపుతోనే సాగుతుంది. ఈ సన్నివేశాలన్నింట్లోనూ హైలైట్ అయ్యేది.. నవ్వులు పంచేది ‘అమాయకత్వం’ మాత్రమే. పాత్రధారుల అమాయకత్వానికి నవ్వుకుంటూనే.. పాపం చివరికి వీళ్ల పరిస్థితి ఏమవుతుందో అన్న చిన్న ఆందోళన కూడా ప్రేక్షకుల్లో రేకెత్తుతుంది. ‘‘ఈ సినిమాలో హీరోయిన్ గా చేశావంటే నువ్వు ఈ ఊర్లోనే కాదు.. పక్క ఊర్లో కూడా వరల్డ్ ఫేమస్ అయిపోతావు’’ లాంటి డైలాగులు భలేగా అనిపిస్తాయి.

సినిమా కోసం హీరో హీరోయిన్ల ఎంపిక ఒక కొలిక్కి వచ్చాక.. షూటింగ్ కు సంబంధించిన సన్నివేశాలు కొంత రిపిటీటీవ్ గా అనిపించడంతో కథ మధ్యలో స్ట్రక్ అయిన భావన కలుగుతుంది. కానీ షూటింగ్ ఊపందుకున్నాక ఇందులో కథనం కూడా జోరందుకుంటుంది. హీరో హీరోయిన్లు పారిపోయి రైలు ఎక్కే సన్నివేశంలో హీరో.. హీరోయిన్ని పక్కన పడేసి నిజమైన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఎక్కేసి ఎక్కడికో వెళ్లిపోవడం లాంటి సీన్లు చాలా ఫన్నీగా తీశారు. ఇక చివరికి వచ్చేసరికి షూటింగ్ అర్ధంతరంగా ఆగిపోయి కథ మలుపు తిరిగే సన్నివేశం దగ్గర్నుంచి చివరి పది నిమిషాల్లో ‘సినిమా బండి’ కొంచెం ఎమోషనల్ గా నడుస్తుంది. ఐతే భావోద్వేగాలు మరీ భారంగా ఏమీ కాకుండా తేలిగ్గానే అనిపిస్తాయి. చివరికి ప్రేక్షకుల ముఖాల్లో ఒక చిరునవ్వు పులుముకునేలాగే సినిమాను ముగించారు. నరేషన్ నెమ్మదిగా ఉండటం.. కొన్ని అనవసర సన్నివేశాలను మినహాయిస్తే ‘సినిమా బండి’ చాలా వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. పైన చెప్పుకున్న ‘కేరాఫ్ కంచెరపాలెం’, ‘మెయిల్’ లాంటి సహజమైన సినిమాలకు కనెక్ట్ అయిన వాళ్లకు ‘సినిమా బండి’ కచ్చితంగా నచ్చుతుంది. ‘కంచరపాలెం’ లాంటి బలమైన ముద్ర వేసే సినిమా కాదు కానీ.. ‘మెయిల్’ లాగా చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీలింగ్ మాత్రం కలిగిస్తుంది ‘సినిమా బండి’.

నటీనటులు: ‘సినిమా బండి’కి నటన పరంగా వికాస్ వశిష్ఠ్ అతి పెద్ద ఆకర్షణ. నవీన్ చంద్ర తరహా లుక్స్ తో కనిపించే వికాస్ కు అలవాటు పడటానికి ప్రేక్షకులకు పెద్దగా సమయం పట్టదు. కాసేపటికే మనకు బాగా తెలిసిన నటుడిలా అనిపిస్తాడు. కర్ణాటక బోర్డర్లో ఉండే పల్లెటూళ్లలో తెలుగు యాసను వికాస్ అందిపుచ్చుకున్న తీరు.. డైలాగులు పలికిన వైనం ప్రశంసనీయం. అతడి హావభావాలు చాలా బాగున్నాయి. అమాయకత్వంతో కూడిన మంచితనాన్ని.. ఉద్వేగాలను చూపించే సన్నివేశాల్లో వికాస్ నటనకు ఫిదా అయిపోతాం. గణ పాత్రలో సందీప్ వారణాసి కూడా చాలా బాగా చేశాడు. ఫొటోగ్రాఫర్ గా అతను బిల్డప్ ఇచ్చే సీన్లు బాగా పండాయి. మంగ పాత్రలో చేసిన ఉమ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. హీరో మరిడేష్ బాబుగా రాగ్ మయూర్ చక్కటి వినోదం పండించాడు. మిగతా నటీనటులందరూ కూడా సహజంగా చేశారు.

సాంకేతిక వర్గం: ‘సినిమా బండి’కి సాంకేతిక ఆకర్షణలు కూడా బాగా సమకూరాయి. శిరీష్ సత్యవోలు పాటలు కథను నడిపించడానికి బాగానే ఉపయోగపడ్డాయి. ప్రత్యేకంగా పాటలంటూ ఏమీ లేవు కానీ.. కథలో భాగంగా వచ్చే మాంటేజ్ సాంగ్స్ అలా నడిచిపోతుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం విషయంలో శిరీష్.. వివేక్ సాగర్ నుంచి స్ఫూర్తి పొందాడనిపిస్తుంది. ఇక సినిమా తీయడంపై తీసిన ఈ సినిమాలో ఛాయాగ్రాహకులు అపూర్వ-సాగర్ ల ప్రతిభ కూడా ప్రశంసనీయమే. ఇలాంటి కథను నమ్మి సినిమా తీయడానికి ముందుకొచ్చిన రాజ్-డీకేల అభిరుచిని మెచ్చుకోవాల్సిందే. ‘సినిమా బండి’కి అవసరమైన ఇంధనాన్ని వాళ్లు సరిగ్గానే సమకూర్చారు. రచయిత వసంత్ మరిగంటి.. దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల తమ ప్రతిభను చాటుకున్నారు. ఇలాంటి కథ రాయడంలో.. సినిమా తీయడంలో వేరే చిత్రాల స్ఫూర్తి కొంత కనిపించినప్పటికీ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను కన్విన్స్ చేయడం.. గంటా 40 నిమిషాల పాటు వారిని ఎంగేజ్ చేయడం తేలికైన విషయమేమీ కాదు. అందుకే రచయిత.. దర్శకుడికి అభినందనలు చెప్పాలి. కథాకథనాల్లో ఇంకొంచెం బిగి ఉండాల్సింది అనిపిస్తుంది కానీ.. ఉన్నంతలో ‘సినిమా బండి’ని బాగానే తీశారు.

చివరగా: సిినిమా బండి.. చూసి తీరాలండీ

రేటింగ్-3/5