Begin typing your search above and press return to search.

సినిమా చూపిస్త మావ - రివ్యూ

By:  Tupaki Desk   |   14 Aug 2015 6:43 AM GMT
సినిమా చూపిస్త మావ - రివ్యూ
X
చిత్రం- సినిమా చూపిస్త మావ
రేటింగ్- 2.75/5
నటీనటులు- రాజ్ తరుణ్ - అవికా గోర్ - రావు రమేష్ - పోసాని కృష్ణమురళి - ప్రవీణ్ - సత్య - కృష్ణభగవాన్ - తోటపల్లి మధు - షకలక శంకర్ - చంటి తదితరులు
సంగీతం- శేఖర్ చంద్ర
రచన-సాయికృష్ణ
మాటలు- ప్రసన్నకుమార్
నిర్మాతలు-జోగాది అంజిరెడ్డి - బెక్కెం వేణుగోపాల్ - రూపేష్, సునీత
కథ - కథనం - దర్శకత్వం- త్రినాథరావు నక్కిన

దిల్ రాజు అంటే టాలీవుడ్ లో ఓ బ్రాండ్. ఆయన కాంప్లిమెంట్ ను చాలామంది సర్టిఫికెట్ లా భావిస్తారు. అలాంటోడు ఓ చిన్న సినిమాను చూసి ‘‘స్పెల్ బౌండ్ అయిపోయా’’ అన్నాడు. నైజాం ఏరియాలో తనే ఆ సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. అదే.. ‘సినిమా చూపిస్త మావ’. మరి రాజు అంతగా నమ్మిన సినిమాలో ఏముందో చూద్దాం పదండి.

కథ:

ఇంటర్లో ఒక్క సంబ్జెక్టూ పాస్ కాలేకపోయిన జులాయి కుర్రాడు కత్తి (రాజ్ తరుణ్). అదే ఇంటర్లో వెయ్యికి 996 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి పరిణీత. ఆ జులాయి.. ఈ బుద్ధిమంతురాల్ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఐతే తండ్రి క్రమశిక్షణ మూలంగా తన ఇష్టాలన్నీ లోలోన దాచేసుకున్న పరిణీత.. కత్తితో పరిచయం తర్వాత తన కోరికలన్నీ తీర్చుకుంటుంది. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే జీవితంలో ప్రతిదాంట్లోనూ క్వాలిటీ కోసం తపించే పరిణీత తండ్రి (రావు రమేష్)కు కత్తి ఏమాత్రం నచ్చడు. అతణ్ని వదిలించుకోవడానికి ఓ పరీక్ష పెడతాడు. ఇంతకీ ఏంటా పరీక్ష? కత్తి ఆ పరీక్షలో నెగ్గాడా? పరిణీతను దక్కించుకోగలిగాడా? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

హీరో ఇంటర్ ఫెయిల్. కానీ హీరోయిన్ ఇంజినీరింగ్ చదివే కాలేజీకెళ్లి క్లాసులో కూర్చుంటాడు. అక్కడి స్టూడెంట్స్ తో కలిసి స్కిట్ కూడా వేస్తాడు. అతడికి కాలేజీ వాళ్లు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఇచ్చేస్తారు. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. ఆ అమ్మాయి ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. ఇంజినీరింగ్ లో చేరుతుంది. తండ్రి ఏ కారణం లేకుండా ఆమెకు పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత తన కూతుర్ని ప్రేమించానని వచ్చిన ఆవారా గాడికి నెల రోజులు నా ఇంటిని పోషిస్తే నా కూతురు నీకే అని బాండ్ రాసిస్తాడు. ఎక్కడైనా లాజిక్ ఉన్నట్లు అనిపిస్తుందా? ‘సినిమా చూపిస్త మావ’లో పంటికింద రాళ్ల లాగా తగిలే లాజిక్ లేని ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. కాసిన్ని నవ్వులు మూటగట్టుకుని రావాలంటే ముందు ఈ విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. లేకుంటే బండి నడవడం కష్టం.

‘బాహుబలి’లా ఇందులో అద్భుతాలేమీ చూపించలేదు. ‘శ్రీమంతుడు’లా ఓ మంచి కథను చెప్పే ప్రయత్నమేమీ చేయలేదు. మామూలు కథా కథనాలతోనే ‘సినిమా చూపిస్త మావ’ నవ్వించి కాలక్షేపం చేయిస్తుంది. దిల్ రాజు చెప్పిన ‘స్పెల్ బౌండ్’ మాట పెద్దది కావచ్చేమో కానీ.. ఎలాంటి సినిమా చూపిస్తారో చూద్దామని వచ్చిన ప్రేక్షకుడు మాత్రం నిరాశ చెందడు.

హీరో ఎంత వెధవో అతడి పరిచయ సన్నివేశంలోనే అర్థమైపోయాక.. అలాంటోణ్ని స్టేట్ ఫస్టొచ్చిన హీరోయిన్ ప్రేమించాలని ప్రేక్షకుడే కోరుకోడు. హీరోయిన్ తండ్రి కంటే ముందు ప్రేక్షకుడిని మెప్పించాలిక్కడ. ఐతే ప్రేక్షకుడిని ఈ విషయంలో కన్విన్స్ చేయడంలోనే ఈ సినిమా విజయం దాగుంది. ఇక్కడ రెండు ముఖ్యమైన సన్నివేశాల గురించి చెప్పుకోవాలి.

హీరోయిన్ ఓ జులాయిని ప్రేమించిందని ఆమెను కొట్టడానికి వెళ్తాడు ఆమె తండ్రి. అప్పుడు హీరో కూడా చెయ్యెత్తుతాడు. ఐతే ఆ చెయ్యెత్తింది హీరోయిన్ తండ్రిని కొట్టడానికి కాదు. అతడి భార్యను కొట్టడానికి. ‘‘నీ పెళ్లాన్ని కొట్టబోతుంటే నీకెంత కోపం వస్తోంది?.. నా పెళ్లాన్ని కొడితే నాకు కోపం రాదా?’’ అంటాడు కథానాయకుడు.

ఇక రెండో సన్నివేశం.. హీరోయిన్ చావు బతుకుల్లో ఉంటుంది. తండ్రి పందెం గురించి మాట్లాడతాడు. హీరో పందెం వదిలేసి హీరోయిన్ ప్రాణం చాలని వెళ్లిపోతాడు. ఆ తర్వాత అతనే వచ్చి ఆమెను కాపాడి.. ‘‘నీకు నచ్చని నేను నెల రోజులు నీ ఇంట్లో ఉంటేనే నీకు కంపరమెత్తిపోయింది. మరి నీ కూతురికి నచ్చనివాడితో జీవితాంతం ఉండాలి. అతడితో కలిసి ఒకే మంచం మీద పడుకోవాలి. కాపురం కూడా చేయాలి’’ అంటాడు. హీరోయిన్ తండ్రితో పాటు మనం కూడా కన్విన్స్ అయిపోతాం. కేవలం డైలాగులతోనే కాకుండా.. సన్నివేశాలతోనూ కన్విన్స్ చేస్తాడు దర్శకుడు. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. ప్రేక్షకుడికి అదేమీ ఇబ్బందిగా అనిపించదు.

పైన చెప్పుకున్న రెండు సీరియస్ సన్నివేశాల్ని పక్కనబెడితే.. సినిమా అంతా వినోదమే ప్రధానంగా. ప్రథమార్ధంలో ప్రేక్షకుడిని సీరియస్ గా సినిమాలో ఇన్వాల్వ్ చేయించే ప్రయత్నమేదీ చేయలేదు దర్శకుడు. లాజిక్ తో సంబంధం లేకుండా కామెడీ చేయిస్తూ.. ఏదో అలా బండి లాగించేద్దామన్న ప్రయత్నమే కనిపిస్తుంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ కూడా ఇమ్మెచ్యూర్డ్ గా అనిపిస్తుంది. ఐతే ఎక్కడా బోర్ కొట్టకుండా బండి నడిచిపోతుంది కాబట్టి సర్దుకోవచ్చు. జబర్దస్త్ టీంతో ఆ షో తరహాలోనే చేసిన ద్రౌపది వస్త్రాపహరణం ఎపిసోడ్ బాగానే నవ్విస్తుంది.

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచే అసలు సినిమా మొదలవుతుంది. తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి రేపేలా ఇంటర్వెల్ ట్విస్టు ఇచ్చిన దర్శకుడు.. ద్వితీయార్ధం నుంచి పనితనం చూపించాడు. హీరోయిన్ పెళ్లి చూపుల సీన్ తో ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు. హీరో డబ్బులు సంపాదించడం మరీ సినిమాటిక్ గా అనిపిస్తుంది. హీరో మావను ఇబ్బంది పెట్టడమే తప్పితే.. హీరోను అతడి మావ ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేకపోయాడు. వన్ సైడ్ వార్ లా వ్యవహారం సాగడం నిరాశ పరుస్తుంది. కామెడీకి ఢోకా లేకపోయినా హీరోకు టాస్క్ అంటూ ఏమీ లేకుండా.. కథనాన్ని లాక్కెళ్లిపోవడం బాలేదు. ఐతే కామెడీ వర్కవుటవడం వల్ల సినిమా వేగంగా క్లైమాక్స్ కు వెళ్లిపోతుంది. పతాక సన్నివేశంలో ఎమోషన్ బాగానే పండింది.

ఐతే సినిమాను సీరియస్ గా ముగించకుండా పోసాని క్యారెక్టర్ ను కొసమెరుపులా వాడుకోవడం ఆకట్టుకుంటుంది. ‘‘దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్ కు కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు’’ అంటూ తనదైన శైలిలో పోసాని చెప్పే డైలాగ్ సీరియస్ సన్నివేశంలోనూ నవ్విస్తుంది. ఎండ్ టైటిల్స్ పడుతున్నపుడు కూడా ప్రేక్షకుడు సీట్లోంచి లేవనంతగా చివర్లో వినోదం పండింది. కథ విషయంలో కొత్తదనం లేకపోవడం, ‘ఉయ్యాల జంపాల’ తరహాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండకపోవడం, లవ్ స్టోరీ సిల్లీగా ఉండటం.. ప్రథమార్ధంలో లాజిక్ కు దూరంగా సాగే సన్నివేశాలు.. హీరోను ఎక్కడా కష్టపెట్టకుండా అతడికి ఎదురే లేనట్లు చూపించడం.. ‘సినిమా చూపిస్త మావ’లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్ లు.

నటీనటులు

సినిమాతోనే ఏ తడబాటూ లేకుండా సహజంగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రాజ్ తరుణ్.. మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయాడు. తొలి సినిమాతో పోలిస్తే అతడి కాన్ఫెడెన్స్ డబులైంది. చాలా ఈజ్ తో కత్తి క్యారెక్టర్ ను చేసుకుపోయాడు. తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతుంటే నేరుగా వాళ్లింటికే వచ్చి మావకు సవాల్ విసిరే సన్నివేశంలో రాజ్ తరుణ్ కాన్ఫిడెన్స్ ను మెచ్చుకుని తీరాలి. క్లైమాక్స్ లో సీరియస్ సీన్ లో కూడా మెప్పించాడు. ఐతే రాజ్ తరుణ్ తన తర్వాతి సినిమాలో కొంచెం రూటు మార్చితే బెటరేమో. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. ప్రతి సినిమాలో రాజమండ్రి యాసే అంటే కష్టం కదా.

ఇక హీరోయిన్ అవికా గోర్ విషయానికొస్తే.. తొలి సినిమా స్థాయిలో ప్రత్యేకత చూపించలేకపోయింది. ‘ఉయ్యాల జంపాల’లోని క్యూట్ నెస్ ఇందులో కనిపించలేదు. మరీ చబ్బీగా తయారైంది. అవిక వెయిట్ పెరిగినంతగా.. డైరెక్టర్ ఆమె క్యారెక్టర్ వెయిట్ పెంచకపోవడంతో నటన పరంగానూ తనదైన ముద్ర వేయలేకపోయింది. ఐతే ఆమె నటన బాలేదు అనేలా ఏమీ లేదు. రావు రమేష్ తనేంటో మరోసారి చూపించాడు. ఆయన క్యారెక్టరైజేషన్, నటన.. ‘విలేజ్ లో వినాయకుడు’ సినిమాను గుర్తుకు తెస్తే తేవొచ్చు కానీ.. అల్లుడితో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడే పాత్రలో మరొకర్ని ఊహించుకోలేని స్థాయిలో కచ్చితమైన నటనతో ఆకట్టుకున్నాడు. తోటపల్లి మధు, ప్రవీణ్, సత్య.. మిగతా పాత్రధారులందరూ కూడా బాగా చేశారు. జబర్దస్త్ బ్యాచ్ నటులందరినీ దర్శకుడు బాగా వాడుకుని నవ్వులు పండించాడు.

సాంకేతిక వర్గం

థ్రిల్లర్, హార్రర్, లవ్ స్టోరీ.. ఇలా ఏ జానర్ సినిమాకైనా సంగీతాన్నందించగలిగే ప్రతిభావంతుల్లో శేఖర్ చంద్ర ఒకడు. అతను చాన్నాళ్ల తర్వాత సరదాగా సాగే ప్రేమకథకు మ్యూజిక్ ఇచ్చాడు. ఈ వేళలోన సాంగ్.. దాని థీమ్ ను ప్రేమ సన్నివేశాలకు వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ పరిమిత వనరుల్నే వాడుకుని మంచి ఔట్ పుటే ఇచ్చాడు. సాంకేతిక విభాగాల్లో ఎక్కువ మార్కులు మాటల రచయితకు పడతాయి. ప్రసన్నకుమార్ రాసిన మాటలు సినిమా అంతా భలేగా పేలాయి. సరదా సన్నివేశాల్లోనే కాదు.. సినిమాకు ఆయువుపట్టుగా నిలిచిన రెండు సీరియస్ సన్నివేశాల్లోనూ అతడి మాటల పదును కనిపిస్తుంది. డైలాగులతో సన్నివేశాలు నడిపించకుండా.. సన్నివేశాలకు తగ్గట్లు మాటలు రాశాడు ప్రసన్నకుమార్. ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలూ ఫ్లాపులే అయినా.. దర్శకుడు త్రినాథరావు ఓ మామూలు కథతోనే బాక్సాఫీస్ దండయాత్రకు రావడం విశేషమే. కథ విషయంలో, క్యారెక్టర్ల విషయంలో నేలవిడిచి సాము చేయలేదు. చాలా మామూలుగా అనిపించే కథనే చాలా సింపుల్ గా అనిపించే కథనంతో రెండుంబావు గంటల పాటు బోర్ కొట్టకుండా చెప్పాడు. రచన విషయంలో అతను చేసిన కసరత్తు వల్ల.. గొప్ప నిర్మాణ విలువలేమీ లేకున్నా.. అదనపు ఆకర్షణలేమీ లేకున్నా.. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సినిమాలో లీనం చేయించగలిగాడు.

చివరగా

లాజిక్కుల గురించి ఆలోచించకుండా.. గొప్ప మలుపులేమీ ఆశించకుండా.. ఈ అల్లరి అల్లుణ్ని చూడ్డానికి వెళ్లండి. సరదా ‘సినిమా’ చూపిస్తాడు. రెండు గంటలు కాలక్షేపం చేయిస్తాడు.

Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre