Begin typing your search above and press return to search.

అమెరికాలో ఏఎంసీ థియేటర్స్ బంద్ - తెలంగాణాపై ఒత్తిడి పెరిగే అవకాశం

By:  Tupaki Desk   |   18 March 2020 3:00 PM GMT
అమెరికాలో ఏఎంసీ థియేటర్స్ బంద్ - తెలంగాణాపై ఒత్తిడి పెరిగే అవకాశం
X
మహమ్మారి కరోనా ప్రభావం జనాలపైనే కాక సినిమాలపై కూడా పడిందనే విషయం అందరికి తెలిసిందే. కరోనా దెబ్బతో దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలతో పాటు సినిమా థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మన దేశ సినీ ఇండస్ట్రీ మీద మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఇండస్ట్రీల మీద కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోబడుతుందని ఆయా చిత్ర పరిశ్రమలు ప్రకటించాయి. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకునే చర్యలలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా ప్రభుత్వం కూడా సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించడం జరిగింది. అమెరికాలో ఈ రోజు నుండి దాదాపు 40 వేల స్క్రీన్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకముందు అవసరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకొని చిత్రాలను ప్రదర్శిస్తామని ప్రకటించిన ఏఎంసీ లాంటి పెద్ద థియేటర్స్ ఇప్పుడు 6 నుండి 12 వారాల పాటు మూసివేయబడతాయని ప్రకటించాయి. అదే సమయంలో, రీగల్ సినిమాస్ తమ థియేటర్స్ తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేసినట్లు వెల్లడించాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ మినహా దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ థియేటర్లను మూసివేసి, అవాంఛిత కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాయి. అమెరికాలో సైతం చిత్ర ప్రదర్శనలు నిలిచిపోవడంతో మన సినిమా మార్కెట్ పై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో థియేటర్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణాలో థియేటర్స్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశముంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం కరోనాను పూర్తిస్థాయిలో తుడిచిపెట్టే వరకు మాల్స్, థియేటర్లు తెరవకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. త్వరలోనే కరోనా ప్రభావం తగ్గిపోయి సినీరంగం మళ్ళీ పుంజుకుంటుందని నిర్మాతల మండలి ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.