Begin typing your search above and press return to search.

థియేటర్ల మూసివేతపై సినిమాటోగ్రఫీ మంత్రి క్లారిటీ..!

By:  Tupaki Desk   |   24 March 2021 8:35 AM GMT
థియేటర్ల మూసివేతపై సినిమాటోగ్రఫీ మంత్రి క్లారిటీ..!
X
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంతో అక్కడక్కడా లాక్ డౌన్ ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇక తెలంగాణలోనూ రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉన్నాయి. కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా థియేటర్లు కూడా మూసి వేస్తారంటూ రూమర్స్ వస్తున్నాయి. థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు మాత్రమే నింపేలా నిబంధనలు విధించాలని వైద్య,ఆరోగ్య శాఖ సూచినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ థియేటర్లను కూడా మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.

తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత ఉండదని, యథావిధిగా నడుస్తాయని ఓ వీడియోలో మంత్రి స్పష్టం చేశారు. సినిమా థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళుతుందని.. సినిమా కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని మంత్రి అన్నారు. ''తెలుగు చలన చిత్ర పరిశ్రమ కరోనా కారణంగా ఇప్పటికే ఎంతో నష్టపోయింది. 24 క్రాఫ్ట్స్ లో పని చేసేవారందరు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లు మూసేస్తున్నారనే రూమర్స్ వస్తున్నాయి. వాటిని ఎవరూ నమ్మవద్దు. ప్రభుత్వ గైడ్ లైన్స్ - కోవిడ్ నిబంధనలతో సినిమా థియేటర్ లు యధావిధిగా నడుస్తాయి. సినిమా మీద ఆధారపడి జీవించే వారందరి గురించి ఆలోచించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది'' అని మంత్రి స్పష్టం చేశారు.