Begin typing your search above and press return to search.

దగ్గుబాటి హీరోల సినిమాల విడుదలపై క్లారిటీ వచ్చేనా..?

By:  Tupaki Desk   |   1 Sep 2021 3:30 AM GMT
దగ్గుబాటి హీరోల సినిమాల విడుదలపై క్లారిటీ వచ్చేనా..?
X
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు సినిమాల నిర్మాణంలో తలపండిన వ్యక్తి. సినిమాలని నిర్మించడమే కానుండా.. వాటిని బిజినెస్ చేసుకోవడంలో సరైన సమయంలో విడుదల చేయడంలో కూడా ఆయనది మాస్టర్ మైండ్. స్క్రిప్ట్ సెలక్షన్ నుంచి నటీనటుల ఎంపిక - సినిమా బడ్జెట్ - ప్రొడక్షన్ అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. సినిమా రెడీ అయిన తర్వాత కూడా పది మంది అభిప్రాయం తెలుసుకున్న తర్వాత గానీ ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకురారు. అయితే థియేట‌ర్ - డిస్ట్రీబ్యూష‌న్ - ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్ర‌గామిగా ఉన్న సురేష్ బాబు.. తన సినిమాలని ఓటీటీ రిలీజ్ చేయడం వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పడకముందే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మూడు సినిమాలను సురేష్ బాబు రిలీజ్ కు రెడీ చేశారు. విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' - 'దృశ్యం 2'.. రానా దగ్గుబాటి తో 'విరాటపర్వం' చిత్రాలను పూర్తి చేశారు. థియేట్రికల్ రిలీజ్ కు పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో ఈ మూడు చిత్రాలను ఓటీటీలకు అమ్మినట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. మొదట్లో ఆ వార్తలను ఖండించినా మెల్లమెల్లగా ఓటీటీ వైపు అడుగులు వేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా 'నారప్ప' చిత్రాన్ని విడుదల చేసారు. థియేటర్ల ఓనర్ ఇలా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం ఏంటని సురేష్ బాబు ని అందరూ ప్రశ్నించారు.

అయితే 'నారప్ప' సినిమాని వేరే నిర్మాతతో కలిసి నిర్మించామని.. అందుకే నిర్మాత మేలుకోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో మిగతా రెండు చిత్రాల రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ ఇస్తారని అనుకున్నారు. 'దృశ్యం 2' 'విరాటపర్వం' చిత్రాలు కూడా ఇతర నిర్మాతల భాగస్వామ్యంతో నిర్మించినవే. అందుకే వీలైనంత త్వరగా వాటిని కూడా ఓటీటీలోకి తీసుకొస్తారని అందరూ భావించారు. కానీ ఈ సినిమాల విషయంలో ఎందుకో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. టాలీవుడ్ లో వినాయక చవితి మొదలుకొని వచ్చే సంక్రాంతి వరకు విడుదల తేదీలను బ్లాక్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నా.. సురేష్ బాబు మౌనంగానే ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

'టక్ జగదీష్' 'మాస్ట్రో' వంటి చిత్రాలు ఎగ్జిబిటర్స్ హెచ్చరికలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటూ.. కంటెంట్ ని ఎక్కువ రోజులు దాచి పెట్టలేం అంటూ ఓటీటీ బాట పట్టించారు. థియేటర్ల మనుగడ గురించి ఆలోచించకపోతే వాళ్ళు చెప్పింది వాస్తవమే అనిపిస్తుంది. సురేష్ బాబు కూడా వాళ్ళలాగే ఆలోచించి, ధైర్యం చేసి మిగతా రెండు చిత్రాలను ఓటీటీలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని అనుకున్నారు. ఓటీటీ డీల్స్ పూర్తయినా లేదా థియేట్రికల్ రిలీజ్‌ అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిందే. పబ్లిసిటీ చేయకుండా ఎక్కువ కాలం సినిమాని హోల్డ్ లో పెట్టడం కూడా మంచిది కాదు. మరి ఈ విషయాలపై అగ్ర నిర్మాత మదిలో ఏముందో!