Begin typing your search above and press return to search.

'కోబ్రా' ట్రైలర్: మ్యాథ్స్ సహాయంతో క్రైమ్స్ చేసే మేధావి కథ..!

By:  Tupaki Desk   |   26 Aug 2022 1:01 PM GMT
కోబ్రా ట్రైలర్: మ్యాథ్స్ సహాయంతో క్రైమ్స్ చేసే మేధావి కథ..!
X
వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ''కోబ్రా''. అజయ్‌ జ్ఞానముత్తు ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కు దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్ట​కేలకు ఆగస్ట్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తునన్నారు.

'కోబ్రా' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అయితే తాజాగా తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది.

విక్రమ్ ని వెళ్లాడదీసి 'నువ్వేనా మ్యాథ్స్ టీచర్ వి' ప్రశ్నిస్తూ తీవ్రంగా కొడుతుండగా.. ఆయన వెటకారంగా పెద్దగా నవ్వడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. విక్రమ్ ఇందులో కోబ్రా అనే టైటిల్ రోల్ పోషించాడు. తన జీవితంలోని ప్రతి ఒక్క సెకనును అంకెలతో.. ప్రతి సమస్యకు గణితశాస్త్రంలో పరిష్కారం కనుగొనగల మేధావిగా అతన్ని పరిచయం చేసారు.

కోబ్రా ఎలాగైతే కుబుసాన్ని వదులుతూ, దాక్కుని శత్రువులపై దాడి చేస్తుందో.. ఇందులో విక్రమ్ పాత్ర కూడా అలానే అనేక అవతారాలను ధరించి దేశ దేశాలలో సంచరిస్తూ, గణితాన్ని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో విభిన్న గెటప్స్‌ లో కనిపించి ఆశ్చర్య పరిచాడు.

ఎవరికీ అంతుచిక్కని కోబ్రా ని పట్టుకోడానికి వేట సాగించే పోలీస్ ఆఫీసర్ గా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కనిపించారు. ఇది ఆయనకు డెబ్యూ మూవీ. విక్రమ్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

మలయాళ నటుడు రోషన్ మాథ్యూ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించగా.. మియా జార్జ్ - కేఎస్ రవికుమార్ - మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్ లో విక్రమ్ అద్భుతమైన నటనతో పాటుగా వైబ్రెంట్ విజువల్స్ మరియు హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ లు హైలైట్ గా నిలిచాయి.

ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఎన్వీఆర్ సినిమా ద్వారా ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

'కోబ్రా' సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. 'మహాన్' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్.. ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ తో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.