Begin typing your search above and press return to search.

తమిళ స్టార్‌ హీరోల మద్య కోర్టు వార్‌

By:  Tupaki Desk   |   9 Jan 2019 11:20 AM GMT
తమిళ స్టార్‌ హీరోల మద్య కోర్టు వార్‌
X
తమిళ హీరో శింబుకు బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ ఎప్పటి నుండో ఉన్న విషయం తెల్సిందే. శింబు కెరీర్‌ ఆరంభం నుండి ఏదో ఒక వివాదంతో సాహవాసం చేస్తూనే ఉన్నాడు. తాజాగా శింబు మరో వివాదంను ఎదుర్కొంటున్నాడు. శింబు గతంలో హీరోగా నటించిన అన్బానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. ఆ చిత్రం ఫ్లాప్‌ కు కారణం శింబు అని, షూటింగ్స్‌ కు సరిగా రాకపోవడంతో పాటు, డైరెక్షన్‌ లో వేలు పెట్టడం వంటి కారణాల వల్ల సినిమా ఫ్లాప్‌ అయ్యిందని, ఆ కారణంగా తనకు భారీ నష్టం వాటిల్లిందని నిర్మాత మైకేల్‌ రాయప్పన్‌ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. నిర్మాత తనకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా నిర్మాతల మండలిని ఆశ్రయించడంతో గొడవ ప్రారంభం అయ్యింది.

నిర్మాతల మండలి శింబుకు నోటీసులు ఇవ్వడంతో పాటు, శింబు తదుపరి చిత్రాలపై నియంత్రణ విధించడం జరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ ఈ విషయమై సీరియస్‌ గా తీసుకుని శింబు నటిస్తున్న సినిమాపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నాడట. మైకేల్‌ రాయప్పన్‌ కు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే శింబు తదుపరి చిత్రం వందా రాజా వాదాన్‌ వరువేన్‌ చిత్రం విడుదల చేసుకోవాలంటూ నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శింబు కోర్టును ఆశ్రయించాడు.

తాను గతంలో అన్బానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌ చిత్రంలో నటించాను, ఆ సినిమాకు నిర్మాత నాకు 8 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాని సినిమా పూర్తి అయ్యేప్పటికి 5 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అయినా కూడా నేను ఊరుకున్నాను. కాని ఇప్పుడు నిర్మాత నాపై లేని పోని అబద్దాలు ప్రచారం చేయడంతో పాటు, తనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి తన పరువు తీశాడు. తన పరువు తీసినందుకు గాను కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా శింబు నిర్మాతపై పరువు నష్టం దావా వేశాడు. దాంతో పాటు నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ నన్ను టార్గెట్‌ చేసి, నా తదుపరి చిత్రాల విషయంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని విశాల్‌ పై కూడా శింబు కోర్టులో ఫిర్యాదు చేశాడు. దాంతో శింబు పిటీషన్‌ ను పరిగణలోకి తీసుకుని విచారణ ప్రారంభించిన కోర్టు విశాల్‌ మరియు నిర్మాత మైకేల్‌ రాయప్పన్‌ లను ప్రతివాధులుగా చేర్చుతూ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయ్యింది. ముందు ముందు ఈ స్టార్‌ హీరోల మద్య వివాదం మరెంత దూరం వెళ్తుందోనంటూ తమిళ సినీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.