Begin typing your search above and press return to search.

'ఎఫ్-3'కి పంచ్ గట్టిగానే పడింది

By:  Tupaki Desk   |   6 Jun 2022 9:32 AM GMT
ఎఫ్-3కి పంచ్ గట్టిగానే పడింది
X
ట్రిపుల్ బ్లాక్‌బస్టర్.. ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ అంటూ 'ఎఫ్-3' గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తోంది చిత్ర బృందం. కానీ వాస్తవంగా చూస్తే ఈ సినిమాకు ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఈ చిత్రం తొలి వీకెండ్లో అంచనాల్ని మించే వసూళ్లు రాబట్టింది రూ.34 కోట్ల దాకా షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది.

వీకెండ్ తర్వాత వసూళ్లలో డ్రాప్ ఏ సినిమాకైనా సహజమే కానీ.. 'ఎఫ్-'కి డ్రాప్ ఓ మోస్తరుగానే ఉంది. వీక్ డేస్‌లో కూడా సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. కానీ వీకెండ్ మీద భారీ ఆశలు పెట్టుకోగా.. కొత్త సినిమాలు దాన్ని గట్టి దెబ్బే కొట్టాయి.

ఒక వీకెండ్లో రిలీజయ్యే రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని, ఓపెనింగ్స్ పరంగా కూడా సత్తా చాటడం అరుదుగా జరుగుతుంటుంది. గత వారాంతంలో అదే జరిగింది. ఇటు మేజర్, అటు విక్రమ్ చిత్రాలకు మంచి టాక్ వచ్చింది. వసూళ్లు కూడా అంచనాల్ని మించి వచ్చాయి. ఇవి రెండూ బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలు. డిఫరెంట్ మూవీస్ కూడా.

కొత్త సినిమాల ద్వారా ఇంత మంచి ఆప్షన్లు ఉన్నపుడు ముందు వారం వచ్చిన రొటీన్ సినిమాను చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించారు. కొత్త సినిమాల ఓవర్ ఫ్లోస్ కొంత కలిసి వచ్చినా, ఫ్యామిలీ ఆడియన్స్ ఓ మోస్తరు స్థాయిలోనే థియేటర్లకు వచ్చినా.. 'ఎఫ్-3'కి అది సరిపోలేదు.

ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.55 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఐతే ఈ సినిమాకు రూ.75 కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ చిత్రం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

ఐతే కొత్త సినిమాల ప్రభావం గట్టిగా పడడంతో రెండో వీకెండ్ తర్వాత 'ఎఫ్-3 నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు వచ్చేసినట్లే చెప్పాలి. యుఎష్‌లో 'ఎఫ్-2' సినిమా 2 మిలియన్ మార్కును దాటేయగా.. 'ఎఫ్-3' ఇప్పటిదాకా అక్కడ 1.3 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. 'ఎఫ్-2' ఓవరాల్‌గా రూ.80 కోట్ల దాకా షేర్ రాబట్టడంతో అదే స్థాయిలో 'ఎఫ్-3'కి బిజినెస్ జరిగింది. కానీ దీని వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేవు.