Begin typing your search above and press return to search.

క‌ల‌ర్స్ స్వాతిని అందుకే ప‌క్క‌న పెట్టేశారా?

By:  Tupaki Desk   |   6 Aug 2022 6:38 AM GMT
క‌ల‌ర్స్ స్వాతిని అందుకే ప‌క్క‌న పెట్టేశారా?
X
ఒక‌ సినిమా సూస‌ర్ హిట్ లేదా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిందంటే దానికి సీక్వెల్స్ ప్లాన్ చేస్తుంటారు. ప్రేక్ష‌కుల్లోనూ ఇలాంటి సీక్వెల్స్ కి మంచి క్రేజ్ వుంటూ వుంటుంది. ఒక సారి మ్యాజిక్ చేసిన జంట మ‌రోసారి అదే త‌ర‌హా పాత్ర‌ల్లో సీక్వెల్స్ లోనూ కంటిన్యూ అవుతూ మ్యాజిక్ చేయ‌డానికి రెడీ అవుతుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో అలాంటి ప్రాజెక్ట్ ల‌పై మంచి బ‌జ్ క్రియేట్ అవుతూ వుంటుంది. కానీ `కార్తికేయ 2` టీమ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా అడుగులు వేయ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. నిఖిల్ హీరోగా న‌టించిన సూప‌ర్ నేచుర‌ల్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ `కార్తికేయ‌2`. చందూ మొండేటి తెర‌కెక్కించిన ఈ మూవీని అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ ల‌పై అభిషేక్ అగ‌ర్వాల్‌, టిజి విశ్వ‌ప్ర‌సాద్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా అనేస‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. 2014లో విడుద‌లై సూప‌ర్ హిట్ గా నిలిచిన‌ `కార్తికేయ‌` మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

`కార్తికేయ‌`లో నిఖిల్ కు జోడీగా క‌ల‌ర్స్ స్వాతి క‌నిపించింది. అయితే సీక్వెల్ లోనూ త‌ను హీరోయిన్ గా వుంటుంద‌ని అంతా ఊహించారు కానీ క‌ల‌ర్స్ స్వాతిని ప‌క్కన పెట్టి చిత్ర బృందం ఆ స్థానంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని హీరోయిన్ గా తీసుకుంది. సీక్వెల్ అంటే ఫ‌స్ట్ పార్ట్ లో న‌టించిన వాళ్లే దాదాపుగా కంటిన్యూ అవుతారు. కీల‌క పాత్ర‌ల్లో ఎంలాంటి మార్పులు వుండ‌వు. కానీ `కార్తికేయ‌2` విష‌యంలో మాత్రం కీల‌కంగా నిలిచే హీరోయిన్ నే మార్చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

క‌ల‌ర్స్ స్వాతి వివాహం త‌రువాత సినిమాలకు దూరంగా వుంటూ వ‌స్తోంది. ఆ కార‌ణంగానే త‌నని తీసుకోలేదా? అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే దీనిపై హీరో నిఖిల్ తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు. సినిమాలో క‌ల‌ర్స్ స్వాతి న‌టించ‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా హీరో క్యారెక్ట‌ర్ మెడిసిన్ పూర్తి చేసిన త‌రువాత మ‌రో మిస్ట‌రీని ఛేధించ‌డం కోసం మ‌రో చోటుకి బ‌య‌లుదేరుతుంది. ఆ కార‌ణంగానే స్వాతిని పార్ట్ 2 కంటిన్యూ చేయ‌లేక‌పోయాం.

క‌ల‌ర్స్ స్వాతిని తీసుకోకూడ‌ద‌ని ఏమీ అనుకోలేదు. అయితే పార్ట్ 2లో క‌థ కొత్త మ‌లుపు తీసుకుంటుంది కాబ‌ట్టి దీనికి నార్త్ ఇండియ‌న్ లుక్ వున్న హీరోయిన్ కావాల‌ని అనుప‌మ‌ని తీసుకోవాల్సి వచ్చింది. అంతే కానీ స్వాతిని కావాల‌ని ప‌క్క‌న పెట్టాల‌నే ఉద్దేశం మాకు లేదు` అని క‌ల‌ర్స్ స్వాతి విష‌యంలో ఏర్ప‌డిన అపోహ‌ల‌కు చెక్ పెట్టారు నిఖిల్‌. ఈ మూవీ ఆగ‌స్టు 13న భారీ స్థాయిలో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.