Begin typing your search above and press return to search.

క‌ల‌ర్స్ స్వాతి ఓ ఇంటిదైంది!

By:  Tupaki Desk   |   31 Aug 2018 12:27 PM GMT
క‌ల‌ర్స్ స్వాతి ఓ ఇంటిదైంది!
X
క‌ల‌ర్స్ స్వాతి పెళ్లి గురించి ఇటీవ‌ల ర‌క‌ర‌కాల రూమ‌ర్లు షికారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు అన్ని రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేసింది. త‌న ప్రేమ‌ను నిజం చేసుకుంటూ.. ప్రియుడు వికాస్‌ ని పెళ్లాడేసింది. తాను ఇష్ట‌ప‌డిన వాడినే కొంగున క‌ట్టేసుకుంది. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పని చేస్తున్న వికాస్ తో స్వాతి చాలా కాలంగా ప్రేమలో ఉంద‌ని వార్త‌లొచ్చాయి. అంతిమంగా ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి సాంప్రదాయ ప్రకారం ఇటీవ‌ల‌ ఈ జంట వివాహం చేసుకున్నారు.

ఈ పెళ్లి ఎలాంటి అన‌వ‌స‌ర హంగామా లేకుండా ఎంతో సింపుల్‌ గా జ‌రిగింద‌ని తెలుస్తోంది. అంతేకాదు ఈ వివాహ‌మ‌హోత్స‌వాన్ని పూర్తిగా ప్ర‌యివేటు వేడుక‌గా నిర్వ‌హించారు. టాలీవుడ్ - కోలీవుడ్ నుంచి పెద్ద‌గా సెలబ్రెటీల్ని ఆహ్వానించలేద‌ని తెలుస్తోంది. కేవలం స్వాతి సన్నిహితులు - ఇరు కుటుంబ స‌భ్యులు - వారి త‌ర‌పున‌ బంధువులు మాత్ర‌మే పెళ్లికి హాజరయ్యారు. అయితే రిసెప్షన్ ని మాత్రం కలర్స్ స్వాతి గ్రాండ్ గా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.

ఇటు టాలీవుడ్ ప్ర‌ముఖుల కోసం హైద‌రాబాద్‌ లో రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మం ఉంటుందిట‌. అలానే కొచ్చిలో సెప్టెంబర్ 2న వేరొక రిసెప్షన్ ను నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. వివాహానంత‌రం చ‌క్క‌న‌మ్మ స్వాతి మ‌లేషియాలోనే సెటిల‌వుతుంద‌ని వార్త‌లొచ్చాయి. దీనిపై స్వాతినే స్వ‌యంగా వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం స్వాతి పెళ్లి వేడుక ఫోటోలు అంత‌ర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిని అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తుండ‌డంతో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.