Begin typing your search above and press return to search.

వాళ్ల ఇంట్లో నందులు పరిగెడుతున్నాయి : పృథ్వీ

By:  Tupaki Desk   |   18 Nov 2017 5:13 PM GMT
వాళ్ల ఇంట్లో నందులు పరిగెడుతున్నాయి : పృథ్వీ
X
నంది అవార్డుల‌పై టాలీవుడ్ లో ర‌చ్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదంపై పలువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టీన‌టులు త‌మ‌త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. స్టార్ కమెడియన్ పృథ్వీ కూడా తనకు నంది అవార్డు ద‌క్క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పృథ్వీ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఖ‌డ్గం సినిమాలో త‌న ప‌ర్ ఫార్మ‌న్స్‌ - తాను చెప్పిన 30 ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌....అనే డైలాగ్ చూసి నంది అవార్డు క‌మిటీ మెంబ‌ర్ త‌న‌కు ఫోన్ చేశార‌ని గుర్తు చేసుకున్నారు. ఈ సారి త‌న‌కు రావాల్సిన జ్యూరీ అవార్డును వేరే వాళ్ల‌కు ఇచ్చార‌ని ఆయ‌న చెప్పార‌న్నారు. అప్ప‌టి నుంచి శివుడు హాలాహ‌లం దాచుకున్న‌ట్లు ఆ విష‌యాన్ని గొంతులో దాచుకున్నాన‌ని అన్నారు. బాలకృష్ణ గారు భైర‌వ ద్వీపం - మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు సినిమాల్లో అద్భుత‌మైన వేషాలు వేశారు. బాలకృష్ణ గారికి - చిరంజీవిగారికి నందులు కొత్తేమీ కాద‌ని - వాళ్ల ఇంట్లో నందులు ప‌రిగెడుతున్నాయ‌ని అన్నారు. బాల‌య్య‌గారు ఎమ్మెల్యే కావ‌డం - టీడీపీ అధికారంలో ఉండ‌డంతోనే లెజెండ్ కు 9 నందులు వ‌చ్చాయ‌ని అంద‌రూ అనుకోవ‌డం స‌హ‌జ‌మ‌న్నారు. ఆ చిత్రానికి ఏ విధంగా నందులు వ‌చ్చాయ‌న్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్నారు. రేసుగుర్రంతో 100 కోట్లు కొల్ల‌గొట్టిన అల్లు అర్జున్ కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చార‌ని చెప్పారు.

లౌక్యం’ సినిమాకు నంది అవార్డు దక్కకపోవడంపై పృథ్వీ తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సినిమాలో త‌న పాత్ర చూసిన ర‌ఘుబాబు ఈ సారి నంది అవార్డు వ‌స్తుంద‌ని చెప్పాడ‌ని, ఫేస్ బుక్ లో కూడా చాలామంది అలాంటి పోస్టులు పెట్టార‌ని చెప్పారు. ఆ సినిమా విజ‌యోత్స‌వ యాత్ర‌కు వెళ్లినపుడు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన మ‌ద్ద‌తు చూసి ఆశ్చ‌ర్యం, ఆనందం క‌లిగాయ‌న్నారు. ఆ సినిమాలో తాను చేసింది స్పూఫ్ అని టాక్ వ‌చ్చినందువ‌ల్ల నా పేరును జ్యూరీ స‌భ్యులు ప‌క్క‌న పెట్టార‌ని తెలిసింద‌ని, అయితే, అది స్పూఫ్ కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ సినిమాలో తాను ఒక టీవీ ఆర్టిస్ పాత్ర‌లో న‌టించాన‌ని, ఆ పాత్ర‌ల న‌టించిన స‌న్నివేశాలు స్పూఫ్ కావ‌ని తెలిపారు. అయినా, త‌న‌కు అవార్డు రాలేద‌ని అడ‌గ‌డానికి త‌న వెనుక పార్టీలు, నాయ‌కులు లేర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కున్న‌ద‌ల్లా అన్న‌గారి ఫొటో మాత్ర‌మే అని, అవార్డు రాలేద‌ని....ఆయ‌న ముందు కూర్చొని త‌న గోడు వెళ్ల‌బోసుకున్నాన‌ని అన్నారు. మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన ఆఖ‌రి చిత్రం `మ‌నం` కు ఉత్త‌మ కుటుంబ క‌థా చిత్రం అవార్డు ఎందుకు రాలేదో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు.

అవార్డుల విష‌యంలో కొన్ని సినిమాల‌కు మాత్ర‌మే నిబంధ‌న‌లు వ‌ర్తించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. క‌మిటీలు మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. దాస‌రి గారు నంది అందుకున్న మామ‌గారు డ‌బ్బింగ్ సినిమా అని, మ‌రోసారి దాస‌రిగారు నంది అందుకున్నపుడు మేస్త్రి సినిమాక‌న్నా మంచి చిత్రాలున్నాయ‌ని చెప్పారు. హ‌ర్ర‌ర్ చిత్రాల‌కు నంది ఇవ్వ‌ర‌ని జ్యూరీ స‌భ్యులు చెబుతార‌ని, అంజ‌లికి ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. నంది అవార్డుల‌ను జ్యూరీ స‌భ్యులు, ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తాయ‌న్నారు. న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ గారు కూడా ప‌ద్మశ్రీ‌ అవార్డు కోసం తాను వెంప‌ర్లాడ‌న‌ని అన్న విష‌యాన్ని పృథ్వీ గుర్తుచేశారు. న‌టుడుకి నందులు కొల‌మానం కాద‌ని మోహ‌న్ బాబుగారు త‌న‌తో అన్నార‌ని గుర్తు చేసుకున్నారు. ప్రేక్ష‌కుల చ‌ప్ప‌ట్లే మ‌న‌కు అవార్డుల‌ని ఆయ‌న చెప్పార‌న్నారు. 500 సినిమాల్లో న‌టించినా కూడా మోహ‌న్ బాబుగారికి నంది అవార్డు రాక‌పోవ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌న్నారు.