Begin typing your search above and press return to search.

వెండితెర రియ‌ల్ మాస్ట‌ర్స్!

By:  Tupaki Desk   |   5 Sep 2022 7:37 AM GMT
వెండితెర రియ‌ల్ మాస్ట‌ర్స్!
X
టాలీవుడ్ హీరోల్లో చాలా మంది స్కూల్ టీచ‌ర్స్ గా, లెక్చ‌రర్స్ గా ఆక‌ట్టుకున్న వాళ్లు చాలా మందే వున్నారు. 'మాస్ట‌ర్' లో మెగాస్టార్, సుంద‌రా కాండ‌లో విక్ట‌రీ వెంక‌టేష్, 'సింహా' లో నంద‌మూరి బాల‌కృష్ణ ఇలా మ‌న హీరోల్లో చాలా మంది వెండితెర‌పై బెత్తం ప‌ట్టుకుని పాఠాలు బోధించారు. మాస్టార్లుగా త‌మ‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఆ పాత్ర‌ల‌కు వ‌న్నె తెచ్చారు. అయితే టాలీవుడ్ ఇండ‌స్ట్రీ లో రీల్ మాస్ట‌ర్లే కాదు రియ‌ల్ మాస్ట‌ర్లు కూడా వున్నారు.

అయితే అందులో అవ‌సరం కోసం మాస్ట‌ర్లుగా మారిన వాళ్లు కొంద‌రైతే ఉపాథ్యాయ వృత్తిని ప్ర‌ధానంగా ఎంచుకుని గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్లుగా, లెక్చ‌ర‌ర్లుగా రాణించిన వారు కూడా వున్నారు. ఉపాథ్యాయులుగా రాణిస్తున్నా వెండితెర‌పై ఉన్న మమ‌కారం, అక్క‌డ రాణించాల‌నే బ‌ల‌మైన కోరిక, ప‌ట్టుద‌ల కార‌ణంగా ఉపాథ్యాయ వృత్తిని వ‌దిలి సినిమాల్లోకి ప్ర‌వేశించిన రియ‌ల్ మాస్ట‌ర్స్ గురించి తెలుసుకుందాం. నేడు ఉపాథ్యాయుల దినోత్స‌వం.

ఈ సంద‌ర్భంగా ఉపాథ్యాయ వృత్తిని వ‌దిలి సినిమాల్లోకి ప్ర‌వేశించిన వారి గురించి తెలుసుకుందాం. హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, ఎం.ఎస్‌. నారాయ‌ణ గురువులుగా ప‌ని చేశారు. వీరిద్ద‌రూ తెలుగులో టాప్‌. తెలుగు పండితులుగా సేవ‌లందించారు. బ్ర‌హ్మానందం అత్తిలిలో ఉపాథ్యాయుడిగా ఉద్యోగం చేస్తూనే ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ఆరాలు తీశారు. ఆ తరువాత అవ‌కాశాలు రావ‌డంతో కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో న‌టించారు.

న‌టుడిగా వెండితెర‌పై బ్ర‌హ్మానందం ఎలాంటి చెర‌గ‌ని ముద్ర వేశారో అంద‌రికి తెలిసిందే. ఇక హాస్య న‌టుడు ఎం.ఎస్‌. నారాయ‌ణ కొంత కాలం ఉపాథ్యాయుడిగా ప‌ని చేస్తూ ప‌లు సినిమాల‌కు ర‌చ‌న‌లు చేశారు. మాట‌లు అందించారు. ఆ త‌రువాత పూర్తి స్థాయి న‌టుడిగా మారి ఉపాథ్యాయ వృత్తిని వ‌దిలేశారు. న‌టుడిగా, ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి త‌ర‌హాలోనే త‌నికెళ్ళ భ‌ర‌ణి ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో పాఠాలు చెప్పారు. ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ కూడా కొంత కాలం టీచ‌ర్ గా ప‌ని చేశారు. ఆ త‌రువాతే ర‌చ‌యిత‌గా మారారు.

బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి వెళితే.. జ‌గ్గ‌య్య, రాజ‌బాబు కూడా కొంత కాలం ఉపాథ్య‌యులుగా ప‌ని చేసిన వారే. ఈ జ‌న‌రేష‌న్ లో త్రివిక్ర‌మ్ కొంత కాలం టీచ‌ర్ గా ప‌ని చేశారు. అయితే ప్ర‌భుత్వ ఉపాథ్యాయుడిగా కాదు. ప్రైవేట్ చెప్పారు. న‌టుడు గౌత‌మ్ రాజు త‌న‌యుడికి ఇంట్లో పాఠాలు చెబుతూ సినిమా ప్ర‌య‌త్నాలు చేశారు.

ఇక సుకుమార్ గురించి తెలిసిందే. త‌ను కాకినాడ‌లో కొన్నేళ్ల పాటు మాథ్స్ లెక్చ‌ర‌ర్ గా ప‌ని చేశారు. సినిమాల‌పై ఇష్టంతో ఉద్యోగాన్ని వ‌దిలేసి డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో చేరారు. త్రివిక్ర‌మ్ అవ‌స‌రం కోసం మాస్ట‌ర్ గా మారితే సుకుమార్ వృత్తి ప‌ట్ల వున్న నిబ‌ద్ధ‌త‌తో మాస్ట‌ర్ అయ్యారు. ఈ ఇద్ద‌రూ టాలీవుడ్ లో ప్ర‌స్తుతం టాప్ డైరెక్ట‌ర్లు గా స్టార్ డ‌మ్ ని ఎంజాయ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.