Begin typing your search above and press return to search.

కీరవాణి మీద పంచులే పంచులు

By:  Tupaki Desk   |   30 March 2017 10:37 AM GMT
కీరవాణి మీద పంచులే పంచులు
X
మొన్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుక రోజు కీరవాణి చాలా ఎగ్జైట్ అయిపోతూ ట్వీట్ల వర్షం కురిపించడం.. తన కెరీర్ ను అవలోకనం చేసుకుంటూ చాలా ఉద్వేగంగా స్పందించడం.. ఈ క్రమంలో బుర్ర లేని వాళ్లంటూ దర్శకుల్ని.. వేటూరి-సీతారామశాస్త్రిల తర్వాత తెలుగు సాహిత్యం అంపశయ్య మీదికి చేరిందంటూ గేయ రచయితల్ని కించ పరిచేలా మాట్లాడారు.

కొందరు దర్శకులతో పని చేయడం వల్ల తాను ఇబ్బంది పడ్డాననో.. వేటూరి-సీతారామశాస్త్రిల తర్వాత సాహిత్య విలువలు కొంచెం తగ్గాయని అంటే సరిపోయేదేమో కానీ.. ఆయన అలా కాకుండా చాలామంది మనసు నొచ్చుుకునేలా మాట్లాడారు. దీంతో ఆయనపై ఆ రోజు నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నందుకు ఆయన ట్విట్టర్ అకౌంట్ శుభాకాంక్షల వెల్లువతో నిండిపోవాల్సింది పోయి.. హేట్ మెసేజ్ లే ఎక్కువ కనిపిస్తున్నాయి.

కీరవాణి మీద నెటిజన్లు చాలామంది విరుచుకుపడ్డారు. మీ తప్పుల మాటేంటి.. మీరు కాపీ చేసిన పాటల మాటేంటి.. మీరు రిటైరైపోతే ఇండస్ట్రీకి వచ్చే నష్టమేంటి అంటూ చాలామంది ప్రశ్నించారు. మరోవైపు చాలా మంది దర్శకులు ఇండస్ట్రీలో చాటుగా విమర్శలు గుప్పిస్తుంటే.. కొందరు గేయరచయితలు డైరెక్టుగానే కీరవాణిని టార్గెట్ చేశారు. మీరు మీ సినిమాలకే కాక.. వేరే సినిమాలకు కూడా పాటలు రాస్తే సినిమా సంగీతం అంపశయ్య మీదికి చేరదంటూ భాస్కరభట్ల సెటైర్ వేస్తే.. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో రామజోగయ్య శాస్త్రి అందుకున్నారు.

మంచి సందర్భం వస్తే ఏ రచయిత అయినా మెరుస్తాడని.. సందర్భం బాలేనపుడు సీతారామశాస్త్రి పాట కూడా పండదని ఆయనన్నారు. మరోవైపు లిరిసిస్ట్ కమ్ క్రిటిక్ సిరాశ్రీ కూడా కీరవాణి విమర్శకుల జాబితాలో చేరాడు. కీరవాణి పాటల్లో సాహిత్యం ఎలా దెబ్బ తింటోందో అతను ఉదాహరణలతో వివరించాడు. ‘శ్రీరామదాసు’లో.. తాజాగా ‘బాహుబలి: ది కంక్లూజన్’లో పాటల సాహిత్యంలోని తప్పులు ఎత్తి చూపారు. పనిలో పనిగా కీరవాణి ‘అంపశయ్య’ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు. మొత్తానికి కీరవాణికి ఎంత గొప్ప సంగీత దర్శకుడైనప్పటికీ.. ఆయన అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో తనపై ఉన్న గౌరవం తగ్గించుకున్నారన్నది వాస్తవం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/