Begin typing your search above and press return to search.

ఏపీలో సినిమా టికెట్ ధరల పై కమిటీ.. సభ్యులు ఎవరంటే..?

By:  Tupaki Desk   |   28 Dec 2021 8:30 AM GMT
ఏపీలో సినిమా టికెట్ ధరల పై కమిటీ.. సభ్యులు ఎవరంటే..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ ధరలను పరిశీలించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పది మందితో కూడిన ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు.

అలాగే రెవెన్యూ, ఆర్థిక, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు.. సమాచార కమిషనర్ మరియు న్యాయశాఖ కార్యదర్శి ఇందులో సభ్యులుగా ఉంటారు. అలానే ఒక ఎగ్జిబిటర్ - ఒక డిస్ట్రిబ్యూటర్ - తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక ప్రతినిధి ఈ కమిటీలో ఉంటారు.

సినిమా టికెట్ ధరల వ్యవహారం మరియు డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించి ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కమిటీ గురించి వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం తమకు ఉందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, ఏపీలో సినిమా టికెట్ల ధరలు మరియు సినిమా థియేటర్లు మూసివేత వ్యవహారాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టికెట్ రేట్లు నియంత్రిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 మీద హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టి.. అనుమతి పత్రాలు లేని పలు సినిమా హాళ్లను సీజ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్ నడపలేమని మూసివేశాయి.

ఈ పరిణామాల మధ్య మంగళవారం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. సినిమా థియేటర్ల మూసివేత.. టికెట్ ధరలపై ప్రభుత్వంతో ఎగ్జిబిటర్లు చర్చలు జరుపనున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరి త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందేమో చూడాలి.