Begin typing your search above and press return to search.

సంజు సినిమా చిక్కుల్లో పడింది

By:  Tupaki Desk   |   13 Jun 2018 3:30 PM GMT
సంజు సినిమా చిక్కుల్లో పడింది
X
ఈ ఏడాది బాలీవుడ్ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘సంజు’ ఒకటి. సంజయ్ దత్ జీవిత కథతో రణబీర్ కపూర్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీని టీజర్.. ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ తెచ్చాయి. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఐతే విడుదలకు సమయం దగ్గర పడుతున్న దశలో ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్ర ట్రైలర్లో చూపించిన ఓ సన్నివేశం సినిమాను ఇబ్బందుల్లో పడేసింది.

ట్రైలర్లో ఒక చోట హీరో రణబీర్ జైల్లో ఉండగా.. అతడి గదిలో టాయిలెట్ లీకేజీ వల్ల నీళ్లన్నీ గదంతా విస్తరించినట్లు చూపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సామాజిక కార్యకర్త పృథ్వీ కేసు వేశాడు. ఆ సన్నివేశం అభ్యంతరంగా ఉందని అతను వాదిస్తున్నాడు. ఇలాంటి సన్నివేశాలు చూపించడం వలన భారతీయ జైళ్లపై చెడు అభిప్రాయం నెలకొంటుందని అతనన్నాడు. ఈ సన్నివేశాన్ని తొలగించాలని అతను డిమాండ్ చేశాడు.

ఈ మేరకు సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషికి కూడా అతను లేఖ రాశాడు. ఆ సన్నివేశాన్ని చిత్రం నుంచి తొలగించాలని కోరాడు. భారత అధికారుల నుంచి తాను పొందిన సమాచారం ప్రకారం ఏ జైలులోనూ ఇలాంటి ఘటనలు జరగలేదని.. జైలు నిర్వహణలో ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారని పృథ్వీ తన లేఖలో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ నేపథ్యం చిత్ర విడుదలకు ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయేమో అని చిత్ర బృందం కంగారు పడుతోంది.