Begin typing your search above and press return to search.

..కేసు అయ్యేట్టుందిగా సన్నీ

By:  Tupaki Desk   |   22 July 2016 4:11 PM GMT
..కేసు అయ్యేట్టుందిగా సన్నీ
X
కొన్ని అవకాశాలు తలుపు తట్టినప్పుడు సంతోషంతో ఊగిపోతుంటారు. అయితే.. ఇంత ఆనందాన్నిచ్చే ఇలాంటి వాటితో ఏమైనా తలనొప్పులు వచ్చి పడతాయా? అన్న చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెరిగిన అవగాహన.. చైతన్యంతో ప్రముఖులకు కేసుల తలనొప్పి ఈ మధ్యన ఎక్కువవుతోంది. తాజాగా అలాంటి తలనొప్పే బాలీవుడ్ శృంగార తార.. అడల్ట్ కామెడీ స్టార్ సన్నిలియోన్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు మీద జాతీయ గీతాన్ని అవమానించారంటూ ఢిల్లీలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఒకటి బుక్ అయ్యింది. ప్రోకబడ్డీ లీగ్ లో భాగంగా గురువారం సన్నీని ప్రత్యేక అతిధిగా ఆహ్వానించటమే కాదు.. మ్యాచ్ ప్రారంభంలో జాతీయ గీతాన్ని ఆలపించేలా నిర్వాహకులు చేశారు. దీంతో పొంగిపోయిన ఆమె.. నిన్న జనగణమణను పాడ ప్రయత్నం చేశారు.

పుట్టి పెరిగిందంతా విదేశాల్లో కావటం.. జనగణమణ.. కంఠతా రాకున్నా.. ప్రాక్టీస్ చేసినప్పటికీ.. పలకాల్సిన రీతిలో గీతాన్ని ఆలపించకపోవటంతో.. తాను హర్ట్ అయ్యానని.. జాతీయ గీతాన్ని ఆలపించటంలో చట్టంలో పేర్కొన్న రీతిలో పాడలేదంటూ ఫిర్యాదు చేశారు. గత సీజన్ లో ఇదే అంశంపై.. ఇదే టోర్నీకి సంబంధించి బిగ్ బీ అమితాబాద్ మీద కూడా ఫిర్యాదు నమోదైంది. తాజాగా.. సన్నీ మీద ఫిర్యాదు అందింది. అయితే.. ఈ ఫిర్యాదును ఇంకా కేసు కట్టలేదని.. ప్రాధమిక దర్యాప్తు అనంతరం నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదుదారు చెప్పింది నిజమా? అబద్ధమా? అన్న ప్రశ్నల్ని పక్కన పెడితే ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. జాతీయ గీతాన్నికానీ.. మరేదైనా కానీ కావాలని అవమానించటం వేరు.. అవగాహనరాహిత్యంతో తప్పు చేయటం వేరు. తాజా ఉదంతంలో సన్నీది తప్పు అయితే.. అది రెండో కారణం వల్లే కావాలని కానీ.. మొదటి కారణం వల్ల కాదన్న విషయం గురువారం ఆమె జాతీయ గీతాన్ని ఆలపించే దృశ్యాల్ని చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.