Begin typing your search above and press return to search.

ఆచార్య - విరాఠ ప‌ర్వం చిత్రాల‌పై సెన్సార్ కు ఫిర్యాదు‌!

By:  Tupaki Desk   |   10 April 2021 7:39 AM GMT
ఆచార్య - విరాఠ ప‌ర్వం చిత్రాల‌పై సెన్సార్ కు ఫిర్యాదు‌!
X
ఛత్తీస్ ఘ‌డ్ ‌లో 22 మంది సిఆర్ ‌పిఎఫ్ జవాన్ల ఊచ‌కోత దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం అయిన సంగ‌తి తెలిసిందే. జ‌వాన్ల‌పై మావోల ఆకస్మిక దాడి దేశం మొత్తాన్ని కదిలించింది. జవాన్ల మరణాలను పౌరులు ఖండిస్తుండగా మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరించిన చిత్రాలకు వ్యతిరేకంగా పోరాడటానికి హైదరాబాద్ ఆధారిత సంస్థ యాంటీ టెర్రరిజం ఫోరం కీలక నిర్ణయం తీసుకుంది.

న‌క్స‌లిస్టుల్ని మావోల్ని హీరోలుగా చూపించే సినిమాల‌కు చెక్ పెట్టాల‌ని యాంటీ టెర్ర‌రిజం ఫోరం డిమాండ్ చేస్తోంది. త్వ‌ర‌లో రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న రెండు భారీ చిత్రాలు ఆచార్య‌.. విరాఠ‌ప‌ర్వం న‌క్స‌లిజం నేప‌థ్య సినిమాలు అన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య‌లో చిరంజీవి న‌క్స‌లిస్ట్ గా క‌నిపించ‌నుండ‌గా... విరాఠ‌ప‌ర్వంలో రానా దగ్గుబాటి మావోయిస్టుగా క‌నిపించ‌నున్నారు. న‌క్స‌లిజం అడ‌వుల నేప‌థ్యంలోని సినిమాలివి. ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయ‌కులు మావోయిస్టులుగా న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని పెంచింది.

జ‌వాన్ల ఊచ‌కోత నేప‌థ్యంలో మావోయిస్టులు (ఒక ఏరియాలో ఇలా పిలుస్తారు) నక్సలిజం లేదా అన్న‌ల భావజాలాలతో తెర‌కెక్కే సినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వవద్దని కోరుతూ యాంటీ టెర్రరిజం ఫోరం సెన్సార్ బోర్డును కలిసింది. నక్సలిజం భావజాలం గురించి సానుకూలతను వ్యాప్తి చేసే చిత్రాలను నిషేధించాలని కోరింది.

అయితే కొన్ని సెక్ష‌న్ల‌ ప్రజల నుండి ఈ తరహా డిమాండ్లు రావడం ఇదే మొదటిసారి కాదు కానీ ఈసారి ఒక సంస్థ దీనికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సందర్భంలో విరాఠ‌పర్వం -ఆచార్యలపై సిబిఎఫ్ సీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలన్న చ‌ర్చ సాగుతోంది. ఏప్రిల్ 30 న విరాఠ‌ప‌ర్వం .. మే 13 న ఆచార్య విడుద‌ల కావాల్సి ఉండ‌గా ప్ర‌స్తుత డిమాండ్ వేడెక్కిస్తోంది.

రానా- సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న `విరాట పర్వం` అవిభాజిత‌ ఆంధ్రప్ర‌దేశ్ లో తొంభైల నాటి నక్సల్ ఉద్యమం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేస్తున్నారు. చిరంజీవి ఆచార్య మావోయిస్టుగా మారిన సంఘ‌ సంస్కర్త కథాంశం. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దేవాదాయ శాఖ కుంభ‌కోణం నేప‌థ్యం ఈ చిత్రంలో ఆస‌క్తిని క‌లిగిస్తుంద‌ని ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి. పాట మిన‌హా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌యింది.