Begin typing your search above and press return to search.

తలైవా.. ఏదో ఒకటి తేల్చవయా..

By:  Tupaki Desk   |   16 Jan 2018 8:50 AM GMT
తలైవా.. ఏదో ఒకటి తేల్చవయా..
X
సూపర్ స్టార్ రజనీకాంత్.. భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమా రిలీజ్ ఒకడుగు ముందుకు.. ఇంకో అడుగు వెనక్కు అన్నట్టుగా ఎటూ తేల్చకపోవడం టాలీవుడ్ ను కలవర పెడుతోంది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనే కాదు.. సౌత్ అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.

కిందటి నెలలో అభిమానులతో రజనీ మీటయినప్పుడు ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజవుతుందని చెప్పారు. ఏప్రిల్ 27 నాటికి మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను... అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న నాపేరు సూర్య రిలీజ్ చేస్తున్నట్లు ఆయా సినిమా నిర్మాతలు ప్రకటించారు. రజనీ సినిమా 14న విడుదలైతే రెండు వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ 2.0 రిలీజ్ ఇంకాస్త వెనక్కెళ్లి ఏప్రిల్ 27న వస్తుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇది మహేష్.. అర్జున్ సినిమాల నిర్మాతలను కలవరపరుస్తోంది. 2.0 నిర్మాతలేమో ఇంతవరకు అఫీషియల్ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడమా.. రిలీజ్ వాయిదా వేయడమా తెలియక తెలుగు నిర్మాతలేమో కిందమీదా పడుతున్నారు.

ఒకేరోజున మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైతే చాలా పరిమిత థియేటర్లే లభిస్తాయి. సినిమా యావరేజ్ గా ఉందని టాక్ వచ్చినా దారుణమైన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అదీగాక 2.0 మూవీకి ఉన్న క్రేజ్ ను బట్టి అత్యధిక థియేటర్లు ఆ సినిమాకే వెళ్లిపోతాయి. ఈ పరిస్థితుల్లో లైకా ప్రొడక్షన్స్ కానీ.. హీరో రజనీ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.