Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ పై కుట్ర చేశారా?

By:  Tupaki Desk   |   1 Aug 2019 2:30 PM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ పై కుట్ర చేశారా?
X
తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ పెరుగుతోంది. ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ మ‌న‌దే హ‌వా న‌డుస్తోంది. ముఖ్యంగా నంబ‌ర్ వ‌న్ అని చెప్పుకునే బాలీవుడ్ మెడలు సైతం వంచే స‌త్తా మ‌న‌కే మునుముందు సాధ్య‌మ‌నే న‌మ్మ‌కం బ‌ల‌ప‌డుతోంది. ప్ర‌స్తుత జోరు చూస్తుంటే ఈ దూకుడుకు ఎదురే లేద‌నిపిస్తోంది. `బాహుబ‌లి` త‌ర్వాత అమాంతం సీన్ మారింది. న‌వ్య‌పంథా క‌థ‌ల‌తో తెలుగు సినిమాల మార్కెట్ అంత‌కంత‌కు విస్త‌రిస్తోంది. యూనివ‌ర్శల్ అప్పీల్ మ‌న క‌థ‌ల్లో క‌నిపిస్తోంది. హిందీ మార్కెట్లో మ‌న సినిమాల డ‌బ్బింగ్ రైట్స్ కి .. అక్క‌డ శాటిలైట్ రైట్స్ కి గిరాకీ పెరిగింది. మ‌న సినిమాల్ని పోటీ పడి కొనుక్కునేవాళ్లు ఉన్నారు.

అయితే ఇక్క‌డే వ‌చ్చింది ఓ చిక్కు. తెలుగు సినిమాల కోసం ప‌ది మందీ పోటీకి వ‌స్తుండ‌డంతో దానివ‌ల్ల రేట్లు పెంచాల్సొస్తోంది. ఇది కొంద‌రికి న‌చ్చ‌లేదు. కంట‌గింపుగా మారింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి అంత పెద్ద మొత్తంలో సొమ్ములు చెల్లించాల్సి రావ‌డంపై స‌ద‌రు బిజినెస్ వ‌ర్గాల‌కు స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంద‌ట‌. అందుకే తెలుగు సినిమాల హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కొనుక్కునే మార్కెట్ జ‌నం అంతా ఒక సిండికేట్ గా మారార‌ట‌. వీళ్లంతా రింగ్ అయ్యి కూడ‌బ‌లుక్కుని మ‌న సినిమా రేంజును త‌గ్గించాల‌ని కుట్ర చేశార‌ట‌.

ముంబై వ్యాపారులు సిండికేట్ అయ్యారు. అందువ‌ల్ల ఇక‌పై తెలుగు సినిమాల హిందీ రైట్స్ కి ధ‌ర ప‌ల‌క‌దు. తెలుగు వాళ్ల‌కు ఎందుకు అంత హైప్ ఇవ్వ‌డం? దీని వ‌ల్ల మ‌న‌కే న‌ష్టం!! అని మీటింగ్ పెట్టుకున్నార‌ట‌. దీంతో ఇన్నాళ్లు తెలుగు సినిమాల హిందీ డ‌బ్బింగ్ రైట్స్ గురించి ఆస‌క్తిగా మాట్లాడుకున్న వాళ్లు ఇక‌పై ఆ సీన్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. బెల్లంకొండ శ్రీ‌ను లాంటి అప్ కం హీరోకే హిందీ డ‌బ్బింగ్ రైట్స్ 12 కోట్లు ప‌లుకుతోంది. మ‌న అగ్ర హీరోల‌కు 25-30 కోట్ల వ‌ర‌కూ ప‌లుకుతోంది. ఆ బిజినెస్ మొత్తం త‌గ్గించాల‌ని అక్క‌డ కూడ‌బ‌లుక్కున్నార‌న్నది వేడెక్కిస్తోంది. కేవ‌లం బెల్లంబాబుకే కాదు అంద‌రు హీరోల్ని త‌గ్గించాల‌ని మాట్లాడుకున్నార‌ట‌. సిండికేట్ అవ్వ‌డం అంటే.. వాళ్ల‌లో వాళ్లు ఇక పోటీ ప‌డ‌రు.. మాట్లాడుకుని మ‌న‌ల్ని త‌గ్గించేందుకు వ‌స్తారు. బేరం లేకుండా చేసి వాళ్లు చెప్పిన రేటుకే ఇచ్చేలా క‌ట్ట‌డి చేస్తార‌ట‌. ఒక అగ్ర నిర్మాణ సంస్థ ప్ర‌తినిధి కం నిర్మాత మేనేజ‌ర్ వెల్ల‌డించిన విష‌య‌మిది. ముంబై సిండికేట్ మ‌న‌ల్ని పెద్ద దెబ్బ కొట్టేందుకు కుట్ర ప‌న్నుతోంది. మ‌రి దీనిని తిప్పి కొట్టేదెలా? అన్న‌ది మ‌న మేక‌ర్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుందేమో!!