Begin typing your search above and press return to search.

కంటెంట్ ఉండాలేగానీ ఆడియన్స్ ఆగరు: రామ్

By:  Tupaki Desk   |   12 July 2022 9:55 AM GMT
కంటెంట్ ఉండాలేగానీ ఆడియన్స్ ఆగరు: రామ్
X
టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ రూట్ ప్రత్యేకం. తెరపై ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి శుభం కార్డు పడేవరకూ రామ్ తెగ సందడి చేస్తూ ఉంటాడు. కథను పరుగులు తీయించడం .. సన్నివేశాల్లో సందడి తగ్గకుండా చూడటం ఆయనకి అలవాటు. ఇక డాన్సుల విషయంలో ఆయన మరింత జోరు చూపిస్తూ ఉంటాడు. అందువల్లనే ఆయనను ఎనర్జిటిక్ స్టార్ అని పిలుస్తారు. అలాంటి రామ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ది వారియర్' రూపొందుతోంది.

ఈ నెల 14వ తేదీన ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో విడుదలవుతోంది. తాజా ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ .. ఈ మధ్య కాలంలో కావాలనే పోలీస్ కథలు ఎక్కువగా విన్నాను. కానీ అన్ని కథలు కూడా రోటీన్ గా అనిపించాయి. ఇంక ఈ సారికి వద్దులే .. వేరే సినిమాలు చేద్దామని అనుకుంటూ ఉండగా లింగుసామి వచ్చి ఈ కథను వినిపించాడు. ఇలాంటి కథ కోసం కదా మనం వెయిట్ చేస్తున్నది అనుకుని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. అలా ఈ సినిమా పట్టాలెక్కింది.

ఫామ్ లో లేని లింగుసామితో సినిమా చేయడం గురించి అడుగుతున్నారు .. అలా ఆలోచించేవాడినే అయితే, నేను 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేసేటప్పుడు పూరి గారు కూడా ఫామ్ లో లేరు. ఫ్లాపులు పడినంత మాత్రాన వాళ్లలో టాలెంట్ తగ్గినట్టు కాదు.

వాళ్లిద్దరూ కూడా డైమండ్ లాంటివారే. ఫ్లాపులనేవి ఆ డైమండ్స్ పై పడిన దుమ్ము లాంటివి. అందువలన వాటి విలువ ఎంత మాత్రం తగ్గదు. ఈ కారణంగానే లింగుసామి కథ చెప్పిన వెంటనే రెండో ఆలోచన చేయకుండా రంగంలోకి దిగిపోయాను.

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంది .. ఎవరిని అనుకుంటున్నారు? అని అడిగాను. అప్పుడు లింగుసామి గారు ఆది పినిశెట్టి పేరు చెప్పారు. ఆయన టాలెంట్ నాకు తెలుసు గనుక హ్యాపీగా ఓకే చెప్పేశాను. ఇక కృతి శెట్టి పాత్ర కూడా చాలా ఫాస్టుగా అందరికీ కనెక్ట్ అవుతుంది .. తను చాలా బాగా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ .. బీజియమ్ ఏ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.

ఇక ఇటీవల కాలంలో థియేటర్స్ కి జనం రావడం లేదని అంటున్నారు. కంటెంట్ ఉండాలేగానీ .. ఆడియన్స్ థియేటర్లకు రాకుండా ఆగరు. 'ఆర్ ఆర్ ఆర్' .. 'కేజీఎఫ్ 2' .. 'సర్కారువారి పాట' అందుకు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చాడు.