Begin typing your search above and press return to search.

ఆ బయోపిక్‌ నటించొద్దు అంటూ విజయ్‌ కి లెజెండ్రీ డైరెక్టర్‌ వార్నింగ్‌

By:  Tupaki Desk   |   16 Oct 2020 10:50 AM GMT
ఆ బయోపిక్‌ నటించొద్దు అంటూ విజయ్‌ కి లెజెండ్రీ డైరెక్టర్‌ వార్నింగ్‌
X
గత ఏడాది నుండి శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళిధరన్‌ యొక్క కథను సినిమాను తమిళంలో బయోపిక్‌ గా తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో పట్టాలెక్కాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 800 అనే టైటిల్‌ తో విజయ్‌ సేతుపతి హీరోగా ముత్తయ్య మురళిధరన్‌ బయోపిక్‌ ను దర్శకుడు ఎమ్మెస్‌ శ్రీపతి తెరకెక్కించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్‌ ను కూడా విడుదల చేశాడు. ముత్తయ్య పాత్రలో విజయ్‌ సేతుపతి అచ్చు గుద్దినట్లుగా ఉన్నాడంటూ టాక్‌ వచ్చింది. ఈ సమయంలోనే కొందరు తమిళులు సినిమాపై వ్యతిరేకంగా ఉన్నారు.

సినీ ప్రముఖులు పలువురు విజయ్‌ సేతుపతి ఈ సినిమాను చేయవద్దంటూ సూచిస్తున్నారు. లెజెండ్రీ డైరెక్టర్‌ భారతి రాజా 800 సినిమాను ఉద్దేశించి ఒక లేఖను మీడియాకు విడుదల చేశాడు. మతవాది.. నమ్మకద్రోహి అయిన ముత్తయ్య మురళిధరన్‌ పాత్రను చేయవద్దంటూ విజయ్‌ సేతుపతిని సున్నితంగా ఆయన లేఖలో హెచ్చరించాడు. అలాంటి వ్యక్తి సినిమా తమిళ ప్రేక్షకులకు కాని ఇండియన్‌ ప్రేక్షకులకు కాని అవసరం లేదు అంటూ పలువురు తమిళ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను మొండిగా తెరకెక్కిస్తే ఆ తర్వాత విడుదల సమయంలో కూడా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ సమయంలో విజయ్‌ సేతుపతి మరియు దర్శకుడు శ్రీపతి ఏం నిర్ణయించుకుంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.