Begin typing your search above and press return to search.

మనోజ్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ

By:  Tupaki Desk   |   10 Nov 2017 5:07 AM GMT
మనోజ్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ
X
ఈ రోజుల్లో సినిమాలకు వివాదాలే మంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి. దీపావళి కానుకగా విడుదలైన ‘మెర్శల్’ సినిమాకు వివాదాలు ఎంత మేలు చేశాయో తెలిసిందే. ఆ వివాదల పుణ్యమా అని సినిమా గురించి పెద్ద చర్చ నడిచి.. వసూళ్లు అంచనాల్ని మించిపోయాయి. అంతకుముందు ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు కూడా కాంట్రవర్శీస్ చాలా మేలు చేశాయి. బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ చుట్టూ కూడా ఇప్పుడు పెద్ద వివాదాలే ముసురుకుంటున్నాయి. అవి కూడా సినిమాకు మేలే చేసేలా కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఒక్కడు మిగిలాడు’ విషయంలోనూ వివాదాలు చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది.

‘ఒక్కడు మిగిలాడు’ శ్రీలంకలో తమిళుల పోరాటం నేపథ్యంలో సాగే సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్‌ను పోలిన పాత్ర చేస్తున్నాడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసింది ఎల్టీటీఈ గ్యాంగే అన్న సంగతి తెలిసిందే. ఐతే ‘ఒక్కడు మిగిలాడు’లో తమిళుల పోరాటాన్ని - ప్రభాకరన్‌ ను సానుకూల ధోరణిలో చూపించిన నేపథ్యంలో రాజీవ్ గాంధీ పాత్రను నెగెటివ్‌ గా చూపించి ఉండొచ్చన్న సందేహాల్ని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ విషయమై ప్రకటన కూడా చేశారు. ఈ సినిమాలో రాజీవ్ గాంధీని నెగెటివ్‌ గా చూపించి ఉంటే ఊరుకోమని.. సినిమాను అడ్డుకుంటామని.. ఆడనివ్వమని అన్నారు ఆయన. మరి సినిమాలో నిజంగా అలా ఉంటే.. కాంగ్రెస్ వాళ్లు గొడవ చేస్తే ‘ఒక్కడు మిగిలాడు’కు అది బాగానే కలిసొస్తుందన్నమాట.