Begin typing your search above and press return to search.

రంగస్థలంపై రచ్చ షురు

By:  Tupaki Desk   |   15 March 2018 5:28 AM GMT
రంగస్థలంపై రచ్చ షురు
X
ఏంటబ్బా ఈ మధ్య తెలుగు సినిమా దేనికి వివాదాలు రావడం లేదే అనుకుంటున్న సమయంలో రంగస్థలంపై రచ్చ మొదలైంది. ఈ రోజు పూర్తి ఆల్బం రిలీజ్ చేసారు కాని అందులో మూడు పాటలు గతంలోనే విడుదలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాట అందరికి బాగా రీచ్ కావడంతో పాటు పది మిలియన్ల వ్యూస్ కోసం పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఈ పాట మీద అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట చరణంలో ‘గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లుతుంటే’ అనే పదాలు తమ జాతి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని యాదవ సంఘం ప్రెసిడెంట్ రాములు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ లిరిక్స్ లోని ఆ పదాలను వెంటనే తొలగించకపోతే ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు. దీని గురించి రంగస్థలం టీం ఇంకా స్పందించలేదు కాని ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారుతోంది.

గత ఏడాది డిజే దువ్వాడ జగన్నాధం డ్యూయెట్ విషయంలో కూడా 'గుడిలో బడిలో' పాటకు సంబంధించి ఇలాగే వివాదం చెలరేగితే చివరికి మార్పు చేసి మళ్ళి విడుదల చేసారు. ఇప్పుడు దీంట్లో కూడా ఏమైనా మార్పు చేస్తారేమో వేచి చూడాలి. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాట యు ట్యూబ్ తో పాటు చార్ట్ బస్టర్స్ లో ట్రెండింగ్ లో ఉంది. కాని గొల్లభామ వచ్చి గోళ్ళు గిల్లడం అనే పదాల్లో అభ్యంతరపెట్టేది ఏముంది అనే ప్రశ్న మెగా ఫాన్స్ నుంచి ఎదురవుతున్నా ఇది తమ మహిళల సెంటిమెంట్ కి సంబంధించినది కనక తొలగించాల్సిందే అని ఆ వర్గం నుంచి డిమాండ్ వినిపిస్తున్నట్టుగా తెలిసింది.

సుకుమార్ కాని చంద్రబోస్ కాని ఓపెన్ అయితే తప్ప దీని గురించి క్లారిటీ రాదు. హీరొయిన్ పాత్ర పరంగా అదే వర్గానికి చెందినట్టు చూపించి ఉంటే ఇదేమి సమస్య కాదు. అలా కాదు కేవలం పాటలో రైమింగ్ కోసమో లేక రిథం కోసమో వాడుకుని ఉంటే బదులు చెప్పాల్సి ఉంటుంది. మార్చ్ 30 విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఇదే తొలి వివాదం. మరి చరణ్ అండ్ సుక్కు రియాక్షన్ కోసం వేచి చూడటమే మనం చేయగలిగింది.