Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' చుట్టూ రగులుకుంటున్న వివాదం!

By:  Tupaki Desk   |   15 March 2022 4:30 PM GMT
ఆర్ ఆర్ ఆర్ చుట్టూ రగులుకుంటున్న వివాదం!
X
అల్లూరి సీతారామరాజుకి మన్నెం వీరుడు అనే పేరు ఉంది. ఆంగ్లేయుల చెర నుంచి దేశమాతను విడిపించడం కోసం ఆయన చేసిన పోరాటం అలుపులేనిది. ఎంతో ఆయుధ సంపద ఉన్న .. అధికార బలం ఉన్న ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టినవారాయన.

భారతీయులంతా స్వేచ్ఛా వాయువులను పీల్చాలనే లక్ష్యంతో తన జీవితాన్ని మన్యం ప్రాంతానికి అంకితం చేసిన ఆయన, ముందుగా చెప్పి మరీ ఆంగ్లేయులపై దాడి చేశాడు. అలాంటి ఆయన చరిత్రను ఎలా మారుస్తారంటూ ఇప్పుడు ఆయన మేనల్లుడు గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు.

డబ్బు కోసం .. కమర్షియల్ అంశాల కోసం చరిత్రను ఎలా మారుస్తారని ఆయన అడుగుతున్నారు. గాంధీజీ ఆయుధాలు ధరించి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారనీ .. నేతాజీతో కలిసి పోరాటాలు చేశారని సినిమాలు తీయగలరా? అలాంటి ఒక కల్పిత కథను జోడించడానికి అల్లూరి మాత్రమే దొరికాడా? ఇలాంటి కల్పనలు జోడించడం వలన భావితరాల వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది.

అందువలన సినిమాలో నుంచి అల్లూరి పేరును తొలగించండి" అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ అల్లూరి అభిమానుల వైపు నుంచి బలమైన గళం వినిపిస్తోంది.

అల్లూరి సీతారామరాజు .. కొమరం భీమ్ పోరాటాలు చేసిన ప్రాంతాలు .. కాలాలు వేరు. ఆ ఇద్దరూ ఫలానా చోట కలుసుకున్నారని గానీ .. ఇద్దరి మధ్య స్నేహం ఉందని గాని చరిత్రలో ఎక్కడా రాయబడలేదు. ఏ ఒక్క పేజీలోను వాళ్లిద్దరి ప్రస్తావన కలిసి కనిపించదు.

అలాంటి ఆ ఇద్దరినీ ఎలా కలిసి చూపిస్తారని అల్లూరి అభిమానులు అడుగుతున్నారు. వినోదం కోసం .. డబ్బుకోసం చరిత్రను తప్పుదోవ పట్టించడం కరెక్టు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చరిత్రలో ఇంతవరకూ అల్లూరిని ప్రజలు చూస్తూ వచ్చిన విధానం వేరు .. ఆయనకి ఇంతవరకూ లభిస్తూ వచ్చిన గౌరవం వేరు. ఈ సినిమా తరువాత ఆయనను చూసే దృష్టి కోణం మారకూడదని వాళ్లంతా అంటున్నారు. చరిత్రను వక్రీకరించి .. సినిమాను విడుదలా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం న్యాయపోరాటం చేసి తీరుతామని చెబుతున్నారు.

ఒక వైపున అల్లూరి అభిమానులు తమ మద్దతును కూడగడుతున్నారు. మరో వైపున ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా రాజమౌళి టీమ్ ముందుకు వెళుతోంది. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడవరకూ వెళ్లి ఆగుతుందో!