Begin typing your search above and press return to search.

ఎప్పుడూ మెగా హీరోల సినిమాలపైనే కాపీ ఆరోపణలు...!

By:  Tupaki Desk   |   27 Aug 2020 5:00 PM GMT
ఎప్పుడూ మెగా హీరోల సినిమాలపైనే కాపీ ఆరోపణలు...!
X
టాలీవుడ్ లో ఇప్పుడు ''ఆచార్య'' ''పుష్ప'' సినిమాలపై కాపీ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ''ఆచార్య'' సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని చూసిన కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఈ స్టోరీ నా కథను పోలి ఉందని.. మోషన్ పోస్టర్‌ లో ఉన్న 'ధర్మస్థలి' అనే ఎపిసోడ్‌ తాను రచించిన 'పుణ్యభూమి' అనే రచన నుంచి తీసుకున్నారని అనిల్ కృష్ణ ఆరోపించారు. ఇదే క్రమంలో 'ఆచార్య' కథ తనదేనంటూ బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ మండూరి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై 'ఆచార్య' ప్రొడ్యూసర్స్ మరియు కొరటాల శివ వివరణ ఇచ్చారు. అవన్నీ అసత్య ఆరోపణలని.. ఇది ఒరిజినల్ స్టోరీ అని కాపీ కథ కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిజానిజాలు ఏంటనేది అటుంచితే.. మెగా హీరోల సినిమాలపైనే ముందు నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

కాగా గతంలో రామ్ చరణ్ నటించిన 'మగధీర' సినిమాపై కూడా కాపీ ఆరోపణలు వచ్చాయి. ఎస్పీ చారి అనే నవలా రచయిత తాను 1998లో రాసిన 'చందేరి అనే నవలను కాపీ కొట్టి 'మగధీర' చిత్రాన్ని తీశారని ఆరోపించారు. అలానే చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెం.150' పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. తెలుగు రచయిత ఒకరు 'ఖైదీ నెం.150' మాతృక తమిళ్ 'కత్తి' స్టోరీ తనదేనని.. తన స్టోరీని దొంగిలించి తీసారని.. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న చిరంజీవి న్యాయం చేయాలని కోరాడు. అయితే పరుచూరి గోపాలకృష్ణ - వీవీ వినాయక్ కలిసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని వార్తలు వచ్చాయి. అదే విధంగా చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' విషయంలో కూడా వివాదం రేగింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు 'సైరా' సినిమా తీస్తూ తమ అనుమతి తీసుకోలేదని.. తమ పూర్వీకుల కథను సినిమాగా తీస్తున్నందుకు భారీ పరిహారం చెల్లించాలని కోర్టుకు వెళ్లారు. అయితే కోర్ట్ ఈ కేసుని కొట్టేసింది.

ఇక అల్లు అర్జున్ నటించిన ''అల వైకుంఠపురములో'' సినిమాపై కూడా కాపీ మరకలు అంటుకున్నాయి. కృష్ణ అనే రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నా కథని కాపీ కొట్టి ఈ సినిమా తీసారని ఆరోపించాడు. తాను రచించిన కథతో 'దశ - దిశ' అనే టైటిల్ తో సినిమా తీయాలనుకున్నానని.. కానీ త్రివిక్రమ్ నా స్టోరీని తస్కరించాడని ఆరోపించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాపై కాపీ ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ యువ పురష్కార గ్రహీత డా. వేంపల్లి గంగాధర్ 'పుష్ప' సినిమా తన పుస్తకం మరియు వ్యాసాల ఆధారంగా రూపొందిస్తున్నారని ఆరోపించాడు. తాను రాసిన 'తమిళ కూలీ' కథ మరియు 'ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎందుకో తెలియదు కానీ మెగా హీరోల సినిమాలపై ఇలా మొదటి నుంచి కాపీ ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి.