Begin typing your search above and press return to search.

దేవదాస్ కూడా దొరికిపోయాడు!!

By:  Tupaki Desk   |   29 Sep 2018 8:29 AM GMT
దేవదాస్ కూడా దొరికిపోయాడు!!
X
దర్శకులు రచయితలకు తాము ఒక కథను వేరొకరి నుంచి స్ఫూర్తి చెందామనో లేదా ఫ్రీ మేక్ చేస్తున్నామనో చెప్పడానికి ఈగో అడ్డం వస్తోంది కాబోలు. నిజాలు దాచిపెట్టి తమది ఒరిజినల్ కథ అంటూ కలరింగ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోతున్నారు. 4జి లాంటి టెక్నాలజి వాడకం పుణ్యమా అని సాధారణ ప్రేక్షకులు సైతం కొత్త సినిమాల్లో లోపాలు కాపీ దోషాలను గుర్తుపట్టి అడ్డంగా బుక్ చేసేస్తున్నారు. అలాంటిది దేవదాస్ కూడా ఈ విషయంలో దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడుదల ముందు వరకు తమ సినిమా ఏ కథకు కాపీ కాదని సత్యానంద్ భూపతి రాజా లాంటి అగ్ర రచయితల సహకారంతో అద్భుతంగా తీర్చిద్దిద్దామని కాస్త గట్టిగానే చెప్పాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. హాలీవుడ్ మూవీ అనలైజ్ థిస్ లాగే ఉంది అని కొందరుబలంగా వాదించినా కొన్ని పోలికలు సహజమే లెమ్మని అందరు సర్దుకున్నారు. కానీ చివరికి అనుకున్నదే నిజమైంది. కానీ మరో రూపంలో.

2006లో మమ్ముట్టి హీరోగా శ్రీనివాసన్ మరో కీలక పాత్రలో భార్గవ చరితం మూనం కాండం అనే సినిమా ఒకటి వచ్చింది. పెద్దగా విజయం సాధించని ఆ మూవీకి ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి పాయింట్ తీసుకున్నామని మమ్ముట్టి అప్పట్లోనే ఒప్పేసుకున్నాడు, వికీలో సమాచారం కూడా ఇదే స్పష్టంగా నొక్కి చెబుతోంది. అందులో మమ్ముట్టి డాన్ గా శ్రీనివాసన్ డాక్టర్ గా కనిపిస్తారు. కథలో మెయిన్ పాయింట్ అంతా ఒక్కటే. కాకపోతే తెలుగులో ఉన్నంత రిచ్ నెస్ భారీ బిల్డప్ హీరోయిన్ల అండర్ కవర్ కాన్సెప్ట్ న్యూస్ రీడింగ్ లాంటివి అందులో ఉండవు. మూలం మాత్రం అదే మార్పేమీ ఉండదు. శత్రువుల నుంచి తప్పించుకుని వచ్చిన మమ్ముట్టిని కాపాడిన శ్రీనివాసన్ అతన్ని మంచివాడిగా మార్చాలని పూనుకుంటాడు. విలన్ సాయికుమార్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అందులో నుంచి ఇద్దరు ఎలా బయటపడ్డారు అనేదే భార్గవ చరితం మూనం కాండం. జోమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పద్మ ప్రియా నికిత హీరోయిన్లు.

మరి ఇందరు కలిసి వండాము ఎక్కడ స్ఫూర్తి తీసుకోలేదు అని చెప్పిన శ్రీరామ్ ఆదిత్య ఇప్పుడు మౌనాన్ని వీడి క్లారిటీ ఇస్తే బెటర్. ఒకవైపు డివైడ్ టాక్ తో దేవదాస్ ఇప్పటికే సతమతమవుతున్నాడు. ఇప్పుడు ఇదొకటి తోడయ్యింది. అయినా దర్జాగా రీమేక్ చేస్తే వచ్చే నష్టమేది లేనప్పుడు ఈ దారిని పదే పదే మన దర్శకులు ఎంచుకోవడం విచిత్రమే. సిసి కెమెరా ఉందని తెలిసి కూడా ముసుగు వేసుకోకుండా దర్జాగా ఇంట్లోకి వెళ్లిపోయే దొంగల తరహాలో ఇలాంటి పోకడలు ఇకనైనా ఆపేస్తే బెటర్. ఫ్రేమ్ టు ఫ్రేమ్ సేమ్ లేదు కాబట్టి కాపీ కొట్టలేదు అని సమర్ధించుకోవచ్చు. కానీ మెయిన్ ప్లాట్ ని తీసుకోవడాన్ని మభ్యపెట్టలేరుగా. అందులోనూ గాలి కన్నా వేగంగా పరిగెత్తున్న సాంకేతిక ప్రపంచంలో. కాస్త ఆలోచించండి బాసూ.