Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు కాపీ.. రచ్చ రచ్చే

By:  Tupaki Desk   |   24 Oct 2015 8:44 AM GMT
శ్రీమంతుడు కాపీ.. రచ్చ రచ్చే
X
కాపీ వివాదాలు కోలీవుడ్ - బాలీవుడ్ లనే కాదు.. టాలీవుడ్ ను కూడా కుదిపేస్తున్నాయి. ఈ బాహుబలి తర్వాత టాలీవుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘శ్రీమంతుడు’ కాపీ కథ అంటూ ఇప్పుడు పెద్ద వివాదం రాజుకుంటోంది. మొన్నటిదాకా ఎంత మంచి కథ రాశాడో అంటూ కొరటాలను ఆకాశానికెత్తేసిన వాళ్లు ఇప్పుడు అతడివైపు అనుమానంగా చూస్తున్నారు.

శ్రీమంతుడు విషయంలో ఓ గొడవ ఏంటంటే.. కొన్నేళ్ల కిందట ఓ పెద్ద డైరెక్టర్ మరో పెద్ద నిర్మాతకు ఓ కథ చెప్పాడట. ఐతే ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ కథ పక్కకు వెళ్లిపోయింది. ఐతే ఆ నిర్మాత క్యాంపులో పని చేసే కొరటాల శివ ఆ కథ లైన్ తీసుకుని.. తన ఆలోచనలు కలిపి ‘శ్రీమంతుడు’ కథ రాశాడన్నది అతడి మీద వస్తున్న ఆరోపణ. ఈ కథను ముందు ఎన్టీఆర్‌ కు చెప్పగా.. ఏవో కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ఐతే మహేష్ తో సినిమా ఓకే అయింది. సినిమా పూర్తయింది. విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఐతే ‘శ్రీమంతుుడు’ చూశాక ఒకప్పుడు నిర్మాతకు కథ చెప్పిన పెద్ద డైరెక్టర్ షాకయ్యారట. సన్నిహితుల దగ్గర విషయం చెప్పి బాధపడుతున్నాడట.

ఇక రెండో గొడవ విషయానికొస్తే.. శరత్ చంద్ర అనే రచయిత ‘చచ్చేంత ప్రేమ’ పేరుతో ఓ నవల రాశాడట. ఆ నవల సీరియల్ గా ‘స్వాతి’ వార పత్రికలోనూ ప్రచురితమైందట. ఆ కథతో సినిమా కూడా తీయాలని తాను అనుకున్నానని.. ఓ నిర్మాణ సంస్థకు కథ కూడా చెప్పానని.. ఐతే ఆ కథలోనే అంశాల్నే కాపీ కొట్టి ‘శ్రీమంతుడు’ తీశారని అతను ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని సినీ పెద్దల వద్ద మొర పెట్టుకున్నా లాభం లేకపోయిందని.. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని అంటున్నాడు శరత్ చంద్ర. మరి ఈ ఆరోపణలకు కొరటాల ఏమని సమాధానమిస్తాడో చూడాలి.