Begin typing your search above and press return to search.

అది హాలీవుడ్ మొండికత్తి!

By:  Tupaki Desk   |   15 Oct 2018 3:12 AM GMT
అది హాలీవుడ్ మొండికత్తి!
X
కాపీ అంటే అభిమానులు ఫీలవుతారు కాబట్టి స్ఫూర్తి అనే పదం వాడటం కరెక్ట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ సెన్సేషన్ అరవింద సమేత వీర రాఘవ చేస్తున్న వసూళ్ల జాతర గురించి కాసేపు పక్కన పెడితే ఎప్పటిలాగే గురూజీ ఇతర బాషల నుంచి సీన్లను తీసుకొస్తారనే వాదన ఇందులో కూడా ఋజువు కావడం ఫ్యాన్స్ మనసుకు కష్టంగా అనిపించినా వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇక విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ హాఫ్ లో కీలకంగా కథను మలుపు తిప్పే మొండికత్తి పేపర్ ఎపిసోడ్ చూసారుగా. అక్కడి నుంచే సినిమాలో టెంపో ఓ రేంజ్ లో అందుకుని మళ్ళి దిగకుండా వెళ్ళిపోతుంది. ఇంత సక్సెస్ లో దీనిదే ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

కాకపోతే ఇది త్రివిక్రమ్ స్వంత ఐడియా మాత్రం కానీ కాదు. 2013లో హాలీవుడ్ లో వచ్చిన ది ఫామిలీ అనే సినిమాలో అచ్చం ఇదే ఎపిసోడ్ ఉండటం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. మాఫియా డాన్ అయిన రాబర్ట్ డీనీరో ఫ్రాన్స్ నుంచి అమెరికా వెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉంటాడు. అతని జాడ తెలియక ప్రత్యర్థి వెతుకుతూ ఉంటాడు. స్కూల్ లో ఇవ్వాల్సిన వ్యాసం కోసం రాబర్ట్ కొడుకు కోరిక మేరకు తన స్వంత కథనే చెబుతాడు. ఆ కాగితం ముక్క ఎక్కడెక్కడో ప్రయాణించి ఆఖరికి విలన్ చేతికి చిక్కుతుంది. అప్పుడు రాబర్ట్ జాడ తెలుస్తుంది. అచ్చంగా దీన్నే మొండికత్తి పేరుతో తెలుగీకరించి మనకు అనుగుణంగా వాడేశారు త్రివిక్రమ్.

ఇది కాకతాళీయం అనడానికి లేదు. కళ్ళ ముందు సాక్ష్యం అంత స్పష్టంగా ఉన్నప్పుడు బుకాయించడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు అజ్ఞాతవాసి మొదలుకుని నువ్వు నాకు నచ్చావ్ లో ప్రకాష్ రాజ్ కవిత దాకా త్రివిక్రమ్ ఇలా చేసినవి చాలా ఉన్నాయి. అయినా ఎక్కడి నుంచి కాపీ కొట్టినా లేక స్ఫూర్తి చెందినా ఫైనల్ గా మెప్పించారా లేదా అనేదే ప్రేక్షకులకు ముఖ్యం కాబట్టి ఇందులో త్రివిక్రమ్ ఈ సారి ఫుల్ మార్క్స్ తో పాసైపోవడం ఊరట చెందాల్సిన విషయం.