Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్ 'ఖైదీ'కి కాపీ మరక

By:  Tupaki Desk   |   6 July 2021 10:30 AM GMT
సూపర్‌ హిట్ ఖైదీకి కాపీ మరక
X
తమిళ సూపర్‌ హిట్ మూవీ ఖైదీ తెలుగులో కూడా మంచి విజయన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఖైదీకి వసూళ్ల పరంగా మరియు రివ్యూల పరంగా చాలా పాజిటివ్ టాక్‌ ను దక్కించుకోవడంతో ఆ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఖైదీ సినిమా ను హిందీలో ఇప్పటికే రీమేక్ మొదలు పెట్టారు. మరో వైపు ఖైదీకి సీక్వెల్‌ చేసే యోచనలో కూడా మేకర్స్ ఉన్నారని సమాచారం అందుతోంది. మొత్తానికి ఖైదీ సినిమా విడుదల అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా ఇంకా సోషల్‌ మీడియాలో మెయిన్‌ స్ట్రీమ్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది.

ఈ సమయంలో ఈ సినిమాకు కాపీ మరక అంటింది. ఈ సినిమా తనది అంటూ కేరళకు చెందిన ఒక రచయిత కోర్టును ఆశ్రయించాడు. రాజీవ్‌ అనే వ్యక్తి ఖైదీ సినిమా కథ తనది అంటూ వాదిస్తున్నాడు. ఒక కేసులో తాను అరెస్ట్‌ అయ్యి 2007 లో విడుదల అయ్యిన రాజీవ్‌ ఆ తర్వాత స్నేహితుడి ద్వారా డ్రీం వారియర్స్‌ సంస్థ వారిని సంప్రదించాడట. వారికి ఆ సమయంలో కథ చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కథ విన్న తర్వాత మేకర్స్‌ చాలా కాలం వరకు సైలెంట్ గా ఉండి పోయారు. ఆ కథతో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ సంస్థ వారు సినిమాను నిర్మించారు.

తన స్టోరీ లైన్‌ తో డ్రీమ్‌ వారియర్స్ తన అనుమతి లేకుండా సినిమాను నిర్మించడం మాత్రమే కాకుండా తనకు కనీసం క్రెడిట్స్ ఇవ్వలేదు అలాగే తన కథకు పారితోషికం కూడా ఇవ్వలేదు అంటూ ఆయన కేరళ హైకోర్టకు వెళ్లాడు. ఈ విషయం ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. కేరళ హైకోర్టు ఈ విషయమై తమిళ నిర్మాణ సంస్థ అయిన డ్రీమ్ వారియర్ మరియు చిత్ర దర్శకుడుకు నోటీసులు ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీడియా కథనాలపై డ్రీమ్‌ వారియర్‌ సంస్థ ప్రతినిధులు స్పందించారు.

మీడియాలో కథనాలు వస్తున్నట్లుగా ఇప్పటి వరకు తమకు కోర్టు నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. అసలు ఆ కేసు గురించిన సమాచారం మాకు తెలియదు. అందుకే ఇప్పుడే ఆ విషయమై స్పందించాలని అనుకోవడం లేదు అంటూ ఈ సందర్బంగా నిర్మాతలు పేర్కొన్నారు. మరో వైపు మీడియా వారు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరిస్తున్నాడు. మొత్తానికి సూపర్‌ హిట్‌ ఖైదీ మూవీకి ఇలా కాపీ మరక అంటడం విచారకరం అంటున్నారు.

రాజీవ్‌ తన కథకు నాలుగు కోట్ల పారితోషికం ఇవ్వడంతో పాటు ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు కాపీ రైట్ తనకు మాత్రమే ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు. తనకు న్యాయం జరిగే వరకు ఈ కేసు తేలే వరకు రీమేక్ మరియు సీక్వెల్స్ ను నిలిపి వేయాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.