Begin typing your search above and press return to search.

గుసగుస: `మహర్షి` కాపీ క్యాట్?

By:  Tupaki Desk   |   11 May 2019 5:08 AM GMT
గుసగుస: `మహర్షి` కాపీ క్యాట్?
X
టాలీవుడ్ లో పలు సినిమాల విషయంలో కాపీ క్యాట్ ఆరోపణలు పెద్ద ఎత్తున వివాదానికి తావిస్తున్న సంగతి తెలిసిందే. నేను వినిపించిన ఫలానా లైన్ ని కాపీ చేశారని.. లేదా వినిపించిన కథలో ఫలానా సన్నివేశాల్ని యథాతథంగా వాడేసుకున్నారని.. సినిమా చూసిన తర్వాత అది తనకు అర్థమైందని పలువురు దర్శక రచయితలు ఆరోపించిన సందర్భాలున్నాయి. కొన్ని కోర్టుల పరిధిలోనూ పరిష్కారం అయ్యాయి. తాజాగా అదే తరహాలో మహేష్ 25వ సినిమా `మహర్షి` పైనా ఆరోపణలు రావడం ఫిలింనగర్ గుసగుసల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అసలింతకీ మహర్షి సినిమాని ఎక్కడి నుంచి కాపీ చేశారు? అంటే..

దీనికి సమాధానం ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దగ్గర.. నిర్మాత దిల్ రాజు చెంత ఉందని చెబుతున్నారు. మహర్షి థీమ్ తాను అనుకున్నది. తన ఇమాజినేషన్ నుంచి పుట్టిన కథ అని దర్శకుడు శ్రీవాస్ ఆ సినిమా చూసిన అనంతరం నేరుగా దిల్ రాజునే ప్రశ్నించారట. అయితే ఆ బేసిక్ పాయింట్ ని ఉపయోగించుకుంటున్నట్టు వంశీ పైడిపల్లి కానీ.. దిల్ రాజు కానీ తనని ముందే సంప్రదించలేదనేది శ్రీవాస్ ఆరోపణ. అయితే అతడు దర్శకుడిపై కానీ.. నిర్మాతపై కానీ ఫిర్యాదు చేసే ఆలోచనలో లేడని.. కేవలం దిల్ రాజుతో ఆర్గ్యూ చేసి వదిలేశారని తెలుస్తోంది. కాపీ క్యాట్ వివాదం పేరుతో దర్శకసంఘంలో ఫిర్యాదు చేసే ఆలోచన శ్రీవాస్ చేయలేదని చెబుతున్నారు.

బేసిక్ ఐడియాని లేపేశారు.. ఉపయోగించుకున్నారు.. అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? అంటే అందుకు శ్రీవాస్ సరైన ఆఫర్ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు శ్రీవాస్ కి దిల్ రాజు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. తమ శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో ఓ సినిమా చేసుకునేందుకు అవకాశం కల్పించారట. ఇక దిల్ రాజుకు శ్రీవాస్ చాలాకాలంగా సన్నిహితుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అతడు `రామ రామ కృష్ణ కృష్ణ` సినిమాని తెరకెక్కించారు. రామ్ హీరోగా నటించిన ఆ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇక దిల్ రాజుతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసే ఆలోచనను శ్రీవాస్ విరమించుకున్నారన్నది ఇన్ సైడ్ టాక్. ఇక ఈ ఎపిసోడ్ లో శ్రీవాస్ ఇమాజిన్ చేసిన సింగిల్ లైన్ మాత్రమే ఉపయోగించుకున్నారా? లేదూ అతడు రాసుకున్న కథలోంచి మొత్తం యథాతథంగా ఉపయోగించుకున్నారా? అన్నది ఓ టాప్ సీక్రెట్.