Begin typing your search above and press return to search.

నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్...హైదరాబాద్ లో పెళ్లి?

By:  Tupaki Desk   |   12 March 2020 2:38 PM GMT
నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్...హైదరాబాద్ లో పెళ్లి?
X
ప్రపంచ దేశాలను కోవిడ్-19 (కరోనా) గజగజలాడిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు ఆగిపోగా....జేమ్స్ బాండ్ వంటి సినిమాలు కూడా కొన్ని చోట్ల విడుదల వాయిదా వేసుకున్నాయి. సినీ రంగం....స్టాక్ మార్కెట్....ఇలా దాదాపుగా అన్ని రంగాలపై కరోనా ఎఫెక్ట్ కనబడుతోంది. సినిమా షూటింగ్ లే కాదు...కరోనా వల్ల ఏకంగా టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి వేదిక కూడా మారనుందని టాక్ వస్తోంది. కరోనా దెబ్బకు నితిన్ పెళ్లి వేదిక దుబాయ్ నుంచి హైదరాబాద్ కు మారనుందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచే హోటల్‌ లో నితిన్ పెళ్లి వేడుక కోసం జరుగుతున్న ఏర్పాట్లకు కరోనా బ్రేక్ వేసిందని టాలీవుడ్ టాక్.

నాగర్ కర్నూల్లోని ప్రగతి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న డాక్టర్ సంపత్ కుమార్, నూర్జహాన్ దంపతుల కమార్తె షాలినితో నితిన్‌కు ఫిబ్రవరి 15న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 16న వీరిద్దరి పెళ్లి జరిపించాలని పెద్దలు ముహుర్తం నిర్ణయించారు. దుబాయ్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు నిర్వహించాలనుకున్నారు. పెళ్లి వేడుక కోసం వధూవరులకు కంచి, చెన్నైలో బట్టలు కూడా కొనుగోలు చేశారు. ఓ వైపు పెళ్లి ఏర్పాట్లు చక చక జరుగుతుంటుంటే... మరోవైపు కరోనా విజృంభిస్తోంది. దీంతో, పెళ్లి తేదీని వాయిదా వేయాలా ? లేక అనుకున్న ముహుర్తానికి వివాహం జరిపించేందుకు వీలుగా వివాహ వేదికను మార్చాలా అన్న సందిగ్ధంలో ఇరు కుటుంబాల పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా భయం తో ఇప్పటికే అరబ్ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో దుబాయ్ లో పెళ్లి జరపడం సాధ్యం కాదని ఇరు కుటుంబాల వారు భావిస్తున్నారట. మరో 15 రోజులు వెయిట్ చేసి...కరోనా వైరస్ అదుపులోకి వస్తే దుబాయ్‌ లో లేకుంటే హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారట. దుబాయ్ కాకుంటే... హైదరాబాద్ శివారుల్లోని ఓ ఫాం హౌజ్‌ లో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిమంది బంధువులు, సీని ప్రముఖుల మధ్య పెళ్లి వేడుక నిర్వహించి... ఏప్రిల్ 21న హైటెక్స్‌లో గ్రాండ్‌గా రిసప్షన్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు నితిన్ కుటుంబ సభ్యులెవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు.