Begin typing your search above and press return to search.

RRR రిలీజ్‌.. పైవాడిపైనే నెపం!

By:  Tupaki Desk   |   21 April 2020 6:10 AM GMT
RRR రిలీజ్‌.. పైవాడిపైనే నెపం!
X
లాక్ డౌన్ వ‌ల్ల వినోద ప‌రిశ్ర‌మ‌లు అత‌లాకుత‌లం అయ్యాయి. టాలీవుడ్ ప‌రిస్థితి త‌ల్ల‌కిందులైంది. దేశంలో ప‌రిస్థితి చూస్తుంటే క‌రోనా అంత‌మ‌య్యేదెపుడో? లాక్ డౌన్ ఎప్పటికి ముగుస్తుందో తెలియ‌ని స‌న్నివేశం క‌నిపిస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసినా సినిమా థియేట‌ర్లు ఓపెన్ చేస్తారా.. లేదా? క‌రోనా భ‌యం ప్ర‌జ‌ల్లో ఎంతకాలం ఉంటుంది? అన్న‌ది ఇప్ప‌ట్లో తేలే వ్య‌వ‌హారం కాద‌ని సంకేతాలు అందుతున్నాయి. థియేట‌ర్లు తెర‌వ‌డానికి ఆరు నెల‌ల నుంచి సంవ‌త్స‌ర‌మైనా స‌మ‌యం పుడుతుంద‌ని ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది. కొవిడ్ 19కి వ్యాక్సినేష‌న్ వ‌స్తే కానీ ఏదీ తేల‌ద‌న్న గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌లు జ‌రుపుకుంటున్న సినిమాల‌ ప‌రిస్థితి ఏంటి? రిలీజ్ సాధ్య‌మేనా? అంటే ఎవ్వ‌రూ చెప్ప‌లేని స్థితిలో ఉన్నారు.

ఇప్ప‌టికే పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ ప్ర‌క‌టించిన తేదికి రిలీజ్ అవుతుందా? అంటే ఏమో తెలీద‌నే అంటున్నారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇప్ప‌టికే ఆ సినిమా షూటింగ్ 70 శాతం పూర్త‌యింది. బ్యాలెన్స్ 30 శాతం పూర్తి చేయ‌డానికి జ‌క్క‌న్న‌కు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. కానీ దేశంలో తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న కూడా త‌ల ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న‌ అంశాల‌ను చూస్తుంటే సినిమా వాళ్ల‌కు మ‌రింత ప్ర‌తికూలంగా మార‌తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఇలాంటి సమ‌యంలో ఆర్.ఆర్.ఆర్ గురించి జ‌రుగుతోన్న నెగిటివ్ ప్ర‌చారంపై ఆయ‌న అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

``సినిమాలు స‌వ్యంగా రిలీజ‌వ్వాలంటే ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తి రావాలి. అలా జ‌ర‌గాలంటే.. మొద‌ట లాక్ డౌన్ ఎత్తేయాలి. అటుపై రెడ్ జోన్ లు తొల‌గించాలి. కంటైన్ మెంట్ జోన్ల‌ను తీసివేయాలి. అప్పుడే షూటింగులు చేయ‌గ‌లం... ఏదైనా మాట్లాడ‌గ‌లం`` అని రాజ‌మౌళి అన్నారు. అయితే ఇవ‌న్నీ తొల‌గిపోవాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇవ‌న్నీ చూస్తుంటే సినిమాల‌ రిలీజ్ లు ఎలా అంటే? దేవుడి ద‌యేన‌న్న భావ‌న నెల‌కొంది. ఇది ఒక్క ఆర్.ఆర్.ఆర్ కే వ‌ర్తించ‌దు. మిగ‌తా సినిమాల ప‌రిస్థితి అంతే. ఇప్ప‌టికే దేశంలో అన్ని రంగాల్లో ఆర్ధిక సంక్షో‌‌భం త‌లెత్తింది. దాని నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలా? అంటూ స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇటు టాలీవుడ్ నిర్మాత‌లు దీనిపై సీరియ‌స్ గానే ఆలోచిస్తున్నారు. కాస్ట్ క‌టింగ్ ఫ్యాక్ట‌ర్ కి ఇది దారి తీస్తోంది. హీరోలంతా పారితోషికం త‌గ్గించుకుని కొన్నేళ్ల పాటు సినిమాలు చేస్తే త‌ప్ప టాలీవుడ్ ఆర్ధిక భారం నుంచి బ‌య‌ట ప‌డ‌లేద‌ని విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ విధంగా నిర్మాత‌ల సంఘం ఛాంబ‌ర్ త‌రుపున చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది. వ‌చ్చే నెల‌లో కీల‌క‌మైన నిర్ణ‌యాల్ని వెలువ‌రించేందుకు ఆస్కారం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక మునుప‌టిలా పెద్ద సినిమాలు రిలీజ్ చేసి టిక్కెట్టు బాదేస్తామంటే కుద‌ర‌ని స‌న్నివేశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. టిక్కెట్టు ధ‌ర‌లు అమాంతం దిగి వస్తేనే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ఆక‌ర్షించే వెసులుబాటు ఉంటుంది. అందుకు పాన్ ఇండియా సినిమా అయినా.. ఇంకే సినిమా అయినా త‌లొంచాల్సిందే. జ‌నం ఆర్థిక మాంద్యం నుంచి కోలుకునే వ‌ర‌కూ వెసులుబాటు క‌ల్పించ‌క‌పోతే విప‌త్తు ముగిసినా థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే.