Begin typing your search above and press return to search.

RRR రిలీజ్ డేట్ పై కరోనా పిడుగు?

By:  Tupaki Desk   |   10 April 2020 2:30 PM GMT
RRR రిలీజ్ డేట్ పై కరోనా పిడుగు?
X
తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా సినీప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'RRR'. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8 న సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా షెడ్యూల్ డేట్ ప్రకారం రిలీజ్ కావడం దాదాపు అసాధ్యమని.. వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయక తప్పదని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

దీనికి ఒక కారణం కాదు.. చాలా కారణాలే ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 'RRR' షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జూన్ నెలకల్లా ప్యాచ్ వర్క్ తప్ప కీలకమైన యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉందట. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితి చూస్తుంటే జూన్ నెలాఖరు లోపు షూటింగులు తిరిగి ప్రారంభం అవుతాయా లేదా అన్నదే అనుమానంగా ఉంది. దీంతో షెడ్యూల్ ప్రకారం మూడు నెలలు వెనకపడిపోయే పరిస్థితి ఉందట.

నిజానికి కరోనా సమస్య లేకపోతే ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికే 'RRR' ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. తర్వాత పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ ఇప్పుడు ప్లాన్ మొత్తం గజిబిజిగా మారింది. మరో సమస్య ఏంటంటే ఈ సినిమాలో కొందరు విదేశీ నటులు పని చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ కు ఇప్పుడు అనుమతులు లేవు. మన దేశంలో లాక్ డౌన్ విరమణ ప్రకటించినప్పటికీ.. వారు ఇండియాకు వచ్చే వరకూ షూటింగ్ పూర్తి చేయడం కుదరదు.

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్. రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో పని చేసే పరిస్థితులలో లేవు. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్టులు పని చేయాలంటే హై ఎండ్ సిస్టమ్స్ అవసరం ఉంటుంది. అవి ఆఫీసుల్లోనే ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ తో గ్రాఫిక్స్ వర్క్ నత్తనడకన సాగుతుంది. అంతే కాకుండా ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఒక్క భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చేస్తున్నారు. అక్కడ కూడా కరోనా దెబ్బకు పనులన్నీ ఆగిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ 'RRR' పనులు వేగవంతం కావు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే 'RRR' సంక్రాంతికి రావడం దాదాపు అసాధ్యం అని.. వేసవికి వాయిదా పడుతుందని అంటున్నారు.