Begin typing your search above and press return to search.

హీరో సూర్యపై కోర్టు ధిక్కార కేసు.. కలకలం

By:  Tupaki Desk   |   14 Sep 2020 12:30 PM GMT
హీరో సూర్యపై కోర్టు ధిక్కార కేసు.. కలకలం
X
ప్రముఖ తమిళనటుడు హీరో సూర్య చిక్కుల్లో పడ్డాడు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేసి ఈ వివాదంలో ఇరుక్కున్నారు. సూర్యపై ఏకంగా హైకోర్టు జడ్జి కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం సంచలనమైంది. సూర్య చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కార పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. దీనిపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తాడనే దానిపైనే సూర్య భవిష్యత్ ఆధారపడి ఉంది.

నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షల నిర్వహణ విషయంలో హీరో సూర్య ఈ కామెంట్స్ చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు. ప్రాణభయంతో ఒక పక్క న్యాయమూర్తులే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతున్నారని.. తీర్పులను ఇస్తున్నారని విద్యార్థులను బలిపశువులుగా చేయవద్దని కామెంట్ చేశారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య విద్యార్థులు ప్రాణభయం లేకుండా ధైర్యంగా పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. అయితే సూర్య సదుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినా అందులో న్యాయమూర్తులను ఇన్ వాల్వ్ చేయడంతో ఇరుకునపడ్డారు.

న్యాయస్థానం ప్రోసీడింగ్స్ మీద వ్యాఖ్యలు చేసిన హీరో సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణించాలని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. భారతీయ న్యాయవ్యవస్థను తప్పుపట్టేలా సూర్య వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది.

కరోనా పరిస్థితుల మధ్య ఈ పరీక్షలను రాయాల్సి వచ్చినందు వల్ల తీవ్ర ఒత్తిడికి గురైన ముగ్గురు తమిళవిద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేశారు.