Begin typing your search above and press return to search.

వర్మ ట్వీట్లు.. ఆయన్ని కోర్టుకు లాగుతున్నాయి

By:  Tupaki Desk   |   16 Jun 2016 9:55 AM IST
వర్మ ట్వీట్లు.. ఆయన్ని కోర్టుకు లాగుతున్నాయి
X
ఏ టాపిక్ మీద అయినా.. తనకు తోచినట్లు ట్వీట్లు చేయడం రామ్ గోపాల్ వర్మకు అలవాటు. ఆయన ట్వీట్లు చాలావరకు సరదాగానే ఉంటాయి కానీ.. కొన్నిసార్లు ఆయన మరీ హద్దులు దాటేస్తుంటాడు. అలా దాదాపు రెండేళ్ల కిందట వర్మ.. వినాయక చవితి సందర్భంగా ఆ దేవుడి మీద చేసిన ట్వీట్లు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ‘‘నాదొక అమాయకమైన ప్రశ్న.. తన తలే కాపాడుకోలేని ఓ దేవుడు.. మిగతా వాళ్ల తలల్ని ఎలా కాపాడతాడో ఎవరైనా చెప్పగలరా?’’.. ‘‘దేవుళ్లందరిలో వినాయకుడు లావుగా ఉంటాడు. ఈయన ఎక్కువ తినడంవల్ల లావుగా అయ్యాడా’’.. ‘‘వినాయకుడు తిండి చేత్తో తింటాడా లేక తొండంతోనా’’.. ఇలా వర్మ తనదైన శైలిలో ట్వీట్లు సంధించాడు.

ఐతే సినిమాల గురించి.. రాజకీయాల గురించి వర్మ ఏం మాట్లాడినా చెల్లుతుంది కానీ.. కోట్లాది మంది మత విశ్వాసాలకు సంబంధించిన అంశంపై ఇలా వ్యంగ్యంగా ట్వీట్లు పెట్టడంతో బుక్కయిపోయాడు. అప్పట్లోనే వర్మ ట్వీట్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐతే విమర్శలతో సరిపెట్టకుండా కొందరు వర్మ మీద కేసు కూడా పెట్టారు. ఇప్పుడా కేసు కోర్టు వరకు వెళ్లింది. ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ.. వారిని రెచ్చగొట్టేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ మీద ఐటీ చట్టంలోని 66 (ఎ) సెక్షన్ - ఐపీసీలోని 295 (ఎ) - 505 సెక్షన్లకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముంబైలోని అంధేరీ కోర్టు అంగీకరించింది. జూలై 19 లోపు కోర్టు ముందు హాజరుకావడం కానీ.. తన న్యాయవాది ద్వారా స్పందించడం కానీ చేయాలని వర్మను అంధేరీ కోర్టు ఆదేశించింది. చూస్తుంటే ఈ కేసు వర్మను బాగానే ఇబ్బంది పెట్టేలా ఉంది.